బోగస్‌ కులధ్రువీకరణ పత్రాలపై విచారణ

28 Oct, 2018 08:00 IST|Sakshi

పలుచోట్ల అభ్యంతరాల వెల్లువ

పునర్విచారణకు ఆదేశాలు 

రాజవొమ్మంగి (రంపచోడవరం): మండలంలో రెండో రోజైన శనివారం కులధ్రువీకరణ పత్రాలపై సమగ్ర విచారణ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు రాజవొమ్మంగి తహసీల్దార్‌ కార్యాలయం ద్వారా మంజూరైన 7,209 కులధ్రువీకరణ పత్రాల్లో అనేకం బోగస్‌వి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ సంబంధిత రెవె న్యూ అధికారులకు ఈ నెల 15న ప్రజా ప్రతిఘటన ఎదురైన సంగతి విదితమే. అనర్హులకు కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చారంటూ రాజవొమ్మం గిలో జరిగిన ఉద్యమానికి స్పందించిన జేసీ మల్లి కార్జున, ఐటీడీఏ పీఓ నిషాంత్‌ కుమార్‌ విచారణకు ఆదేశించారు. కులధ్రువీకరణ పత్రాలపై రాజవొమ్మంగి మండలంలోని పలు పంచాయతీల్లో తొలి రోజు జరిగిన గ్రామసభల్లో ప్రజల నుంచి ఒక్క అభ్యంతరం కూడా రాలేదు. 

అయితే రెండో రోజు రాజవొమ్మంగి, కొండపల్లి, వాతంగి గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో లిఖిత పూర్వక అభ్యంతరాలు వచ్చాయి. రాజవొమ్మంగి పం చాయతీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన విచారణలో ఆదివాసీ సంక్షేమ సంఘం నేత కంచెం బాబూరావు నేతృత్వంలో పలువురు ఆదివాసీలు విచారణాధికారిగా వచ్చిన సామర్లకోట తహసీల్దార్‌ శివకుమార్‌కు లిఖితపూర్వకంగా అభ్యంతరాలను అందజేశారు.  వీటిని పరిగణనలోకి తీసుకొని సోమవారం నుంచి ఆయా గ్రామాల్లో ఈ బోగస్‌ కులధ్రువీకరణ పత్రాలపై ఇంటింటికీ వెళ్లి ప్రజల సమక్షంలో విచారణ నిర్వహిస్తామని విచారణాధికారులు తెలిపారు. 

విచారణ ఇలా...
కిర్రాబులో 275, శరభవరంలో 389, రాజవొమ్మంగిలో 332 కులధ్రువీకరణ పత్రాలపై తహసీల్దార్‌ శివకుమార్‌ విచారణ చేపట్టారు. అలాగే కొండపల్లిలో 238, అమీనాబాద్‌లో 68, వాతంగిలో 625 కులధ్రువీకరణ పత్రాలపై చింతూరు తహసీల్దార్‌ పి.తేజేశ్వరరావు విచారణ నిర్వహించి, కొండపల్లిలో 7, వాతంగిలో 3 లిఖిత పూర్వక అభ్యంతరాలు వచ్చాయని వెల్లడించారు. పెద్దాపురం తహసీల్దార్‌ జి.బాలసుబ్రహ్మణ్యం లబ్బర్తిలో 138 పత్రాలపై విచారణ చేపట్టగా ఒక లిఖిత పూర్వక అభ్యంతరం అందినట్లు చెప్పారు. లాగరాయిలో 119 పత్రాలపై విచారణ జరిగింది.

 ఈ గ్రామంలో మంజూరైన  3 కొండకాపు, ఒక కోయదొర సర్టిఫికెట్లు బోగస్‌ అంటూ ఆదివాసీల నుంచి లిఖితపూర్వక అభ్యంతరాలు అందాయని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. వీటిపై కూడా మరో రెండు రోజుల్లో విచారణ చేస్తామన్నారు. ప్రత్తిపాడు తహసీల్దార్‌ కె.నాగమల్లేశ్వరరావు చెరువుకొమ్ముపాలెంలో 212 సర్టిఫికెట్లపై విచారణ చేపట్టగా 12 బోగస్‌ ఉన్నాయంటూ ఫిర్యాదులు అందాయన్నారు. వంచంగిలో నిర్వహించిన విచారణ సభలో 470 కులధ్రువీకరణ పత్రాల వివరాలు వెల్లడించగా 7 పత్రాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. గడుఓకుర్తిలో 322 పత్రాలను పరిశీలించగా ఇక్కడ అభ్యంతరాలు ఏవీ రాలేదన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా