ఆక్రమణలపై ఆరా

22 Nov, 2014 02:43 IST|Sakshi

కందుకూరు : తీగ లాగితే డొంక కదిలింది. పట్టణంలోని అంకమ్మ దేవాలయం ఇరువైపులా ఉన్న స్థలాల ఆక్రమణపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఆక్రమణలపై ‘సాక్షి’ కథనాలు, స్థానిక ఎమ్మెల్యే పోతుల రామారావు ఆగ్రహం, స్థానికుల నుంచి వ్యతిరేకత వెరసి అక్రమార్కుల గుట్టురట్టయింది. శుక్రవారం ‘సాక్షి’లో ‘దేవుని పేరుతో దౌర్జన్యం’ శీర్షికతో జిల్లా టాబ్లాయిడ్ ఏడో పేజీలో ప్రచురించిన కథనానికి అధికారుల్లో చలనం వచ్చింది. అదే రోజు రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి దేవాలయానికి ఇరువైపులా ఉన్న స్థలాలను సబ్ కలెక్టర్ మల్లికార్జున పరిశీలించారు.

 ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న దుకాణాల్లోని వ్యాపారుల వద్దకు వెళ్లి విచారించారు. నెలనెలా అద్దెలు ఎవరికి ఇస్తున్నారని సబ్ కలెక్టర్ ప్రశ్నించగా వారు దివి లింగయ్యనాయుడికి ఇస్తున్నామని చెప్పారు. ఆ వివరాలన్నీ సబ్ కలెక్టర్ నమోదు చేసుకున్నారు. ఆర్టీసీ డిపో ప్రవేశ ద్వారం నుంచి అంకమ్మ దేవాలయం ముఖ ద్వారం వరకు ఉన్న వ్యాపారుల నుంచి అధికారులు స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ అంకమ్మ దేవాలయానికి ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలం మొత్తం మున్సిపాలిటీదేనని అక్కడి వ్యాపారులతో చెప్పారు. ఈ స్థలాలపై వచ్చే ఆదాయం కూడా దానికే చెందాలన్నారు.

ఈ స్థలాలపై సమగ్ర విచారణ కోసం ఓ ట్రైనీ కలెక్టర్‌ని నియమిస్తామని ఆయన స్పష్టం చేశారు. పది రోజుల లోపు విచారణ చేసి స్థలాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అదే విధంగా ప్రతి దుకాణానికి మున్సిపాలిటీ తరఫున రసీదులు ఇచ్చి పన్నులు వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ రమణకుమారిని ఆదేశించారు.

 టీడీపీ నేత తిట్ల పురాణం
 సబ్‌కలెక్టర్ విచారణకు వచ్చి వెళ్లిన త ర్వాత టీడీపీ పట్టణ అధ్యక్షుడు రంగంలోకి దిగారు. ఆక్రమణలపై అధికారులు స్పందించారని తె లుసుకుని ఊగిపోయారు. స్థానిక ఎమ్మెల్యేపై అనవసరంగా నోరుపారేసుకున్నారు. అధికారులను సైతం ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. స్థలాలన్నీ దేవాలయానికి సంబంధించినవేనని అడ్డగోలుగా మాట్లాడారు. ఐఏఎస్ స్థాయి అధికారి వచ్చి స్థలాలన్నీ మున్సిపాలిటీవేనని చెప్పిన తర్వాత కూడా సదరు నేత వ్యవహరించిన తీరుపై స్థానికులు ముక్కున వేలేసుకున్నారు.

మరిన్ని వార్తలు