విశాఖలో ఐ అండ్‌ సీ సెంటర్‌

5 Aug, 2019 10:54 IST|Sakshi

కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన రవాణా శాఖ 

సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం గ్రామంలో ఇన్‌స్పెక్షన్‌ అండ్‌ సర్టిఫికేషన్‌ సెంటర్‌ (ఐ అండ్‌ సీ సెంటర్‌) ఏర్పాటు చేసేందుకు రవాణా శాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఈ సెంటరును మంజూరు చేసింది. దీని నిర్మాణానికి స్థలం చూపిస్తే ఏర్పాటుకు అయ్యే వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.

ఇప్పటికే ఐ అండ్‌ సీ సెంటరు నిర్మాణాన్ని ఏపీలో చేపట్టేందుకు రూ.16.5 కోట్లు కేటాయించాలని మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ (ఎంఓఆర్‌టీహెచ్‌) కేంద్రానికి సిఫారసు చేసింది. అయితే విభజన హామీ అయిన ఐ అండ్‌ సీ సెంటర్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేసుకునేందుకు గత ప్రభుత్వం నాన్చివేత వైఖరి అవలంబించింది. గన్నవరంలో ఏర్పాటు చేస్తున్నామని ఊదరగొట్టారే తప్ప సెంటు స్ధలం కేటాయించలేదు. ఐ అండ్‌ సీ ట్రాక్‌లపై రవాణా వాహనం వెళితే లోపాలన్నీ తెలుస్తాయి. ఫిట్‌నెస్‌ పరీక్షలు మాన్యువల్‌ విధానంలో రవాణా ఇన్‌స్పెక్టర్లు నిర్వహిస్తున్నారు. ఐ అండ్‌ సీ సెంటర్‌ ఏర్పాటైతే ఫిట్‌నెస్‌ పరీక్షలు మొదలు అన్నీ ఆటోమేషన్‌ విధానంలోనే జరుగుతాయి.

విశాఖ జిల్లాలో 14 ఎకరాల స్ధలం
విశాఖ జిల్లా గంభీరం వద్ద రవాణా శాఖకు 14 ఎకరాల స్ధలం ఉండటంతో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం మళ్లీ తాజాగా ప్రతిపాదనలు పంపింది. ఇక్కడే డ్రైవింగ్‌ ట్రాక్‌లు ఉండటంతో త్వరితగతిన ఐ అండ్‌ సీ సెంటరు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ కేంద్రాన్ని కోరింది. డ్రైవింగ్‌ ట్రాక్‌ల ఏర్పాటుకు రాజధానిలో స్ధల సమస్య ఉండటంతో ఇటీవలే  అధికారులు సీఆర్‌డీఏ కమిషనర్‌కు లేఖ రాశారు. నాలుగేళ్ల క్రితం 9 జిల్లాల్లో ఆటోమేషన్‌ విధానంలో డ్రైవింగ్‌ పరీక్షలకు డ్రైవింగ్‌ ట్రాక్‌ల ఏర్పాటుకు కేంద్రం రూ.9 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో విశాఖ, కాకినాడ, ఏలూరు,విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురంలలో ఆటోమేషన్‌ విధానంలో డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు రవాణా శాఖ నిర్ణయించింది.

మరిన్ని వార్తలు