ప్లాస్టిక్‌ రహితంగా ఓ జంట వివాహం

1 Jul, 2019 11:12 IST|Sakshi
వధూవరులతో కాంతిరత్న, అరుణ్‌ దంపతులు 

సాక్షి, విశాఖపట్టణం :  ఆలోచనకి.. ఆచరణకి మధ్య చిన్న వ్యత్యాసం ఉంటుంది. వాస్తవంగా చూస్తే ఆలోచన.. ఆచరణగా మారడానికి ఎంతో కృషి అవసరం.  పర్యావరణంపై ప్రేమ కలిగిన ఓ కుటుంబం ‘పచ్చనాకు సాక్షి’గా వివాహాన్ని జరిపించింది. హాజరైన అతిథులు పదికాలాల పాటు‘పచ్చ’గా వర్థిల్లాలని దీవించారు. బెంగళూరులో నివాసం ఉంటున్న కాంతిరత్న, అరుణ్‌ దంపతులు. పర్యావరణ ప్రియులు. తమ కుమార్తె అదితి వివాహాన్ని ప్లాస్టిక్‌ రహితంగా చేయాలని నిర్ణయించారు. బంధువులందరూ విశాఖలోనే ఉండడంతో నగరంలోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ముంబైకి చెందిన సౌమిత్రతో ఆదివారం జిల్లా పరిషత్‌ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో వివాహాన్ని జరిపించారు. పర్యావరణానికి విఘాతం కలిగించే ఎలాంటి వస్తువుల్ని వినియోగించకుండా పెళ్లితంతును పూర్తి చేశారు.

ఆకుల పందిరి... 
ఉన్నత విద్యావంతులైన కాంతిరత్న, అరుణ్‌ దంపతులకు పర్యావరణ స్పృహ చాలా ఎక్కువ. దీనిని మాటలకు పరిమితం చేయకుండా వీరు ఆచరణలో చూపారు.  కల్యాణ మండపం అలంకరణకు ఆకులు, పువ్వుల్ని వినియోగించారు. కొబ్బరాకుల్ని మండపంపై వేశారు. మండపానికి నాలుగు వైపుల అరటి మెక్కలు కట్టారు. మధ్యలో మెగలి రేకులతో అందంగా అలంకరించారు. 


కొబ్బరి ఆకులు, అరటి మెక్కలు, మెగలి రేకులతో తీర్చిదిద్దిన కళ్యాణ వేదిక

ప్రకృతి విందు.. బహుపసందు.. 
వివాహం అనగానే విందు ఎంతో ప్రత్యేకం. దీనికోసం పెద్దసంఖ్యలో ఆహార పదార్థాలు వండడం, వృధా చేయడం సర్వసాధరణంగా మారింది. దీనికి భిన్నంగా ఈ వివాహ వేడుకలో ఎలాంటి రసాయనాలు, రంగులు వినియోగించకుండా తయారు చేసిన వంటల్ని అతిథులకు వడ్డించారు. 

 ఫలహారం, భోజనం, సాయంత్రం టిఫిన్‌ వంటివి ఆరగించేందుకు అరటి ఆకులు, పోకచెక్క బెరడుతో చేసిన ప్లేట్లను వినియోగించారు. 
రసాయనాలు కలిపిన పానీయాలను అందివ్వకుండా సహజ సిద్ధమైన పెరుగుతో లస్సీని తయారు చేశారు. పేపర్‌ గ్లాస్‌లలో పంపిణీ చేశారు.  
టిఫిన్‌లో సాంబార్‌ కోసం పోకచెక్క బెరడుతో కప్పులను వాడారు. 
ఆహారాన్ని తినేందుకు చెక్క చెంచాలను పంపిణీ చేశారు.  
భోజనం ముగిసిన తరువాత కిళ్లీని ప్లాస్టిక్‌ కవర్‌లో పెట్టకుండా, టూత్‌పిక్‌తో గుచ్చి చేతికి అందించారు. 
భోజనాలు చేసే బల్లపై సైతం ప్లాస్టిక్‌ కవర్‌ వేయకుండా కాగితంతో తయారైనదే వినియోగించారు.

ప్లాస్టిక్‌కు నో... 
ఈ మధ్యకాలంలో వివాహాల్లో చిన్న ప్లాస్టిక్‌ మంచినీటి సీసాలు లేదా పాలిథీన్‌ వాటర్‌ ప్యాకెట్లను అధికంగా వినియోగిస్తున్నారు. లేదంటే వందలాది పాలిథీన్‌ గ్లాసుల్ని వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్‌ వ్యర్థాలు అధికంగా పేరుకుపోతాయి. ఈ విధానానికి స్వస్తి చెప్పారు ఈ దంపతులు. 20 లీటర్ల మంచినీటి బాటిళ్లను తీసుకువచ్చి పేపర్‌ గ్లాస్‌ల్లో నీటిని అతిథులకు అందించారు. అలాగే ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా చర్యలు తీసుకున్నారు.  

మెనూ కూడా ప్రత్యేకమే..
మెనూ రూపకల్పనలో సైతం కాంతిరత్న, అరుణ్‌లు ఎంతో శ్రద్ధ వహించారు. అతిథులకు పదులసంఖ్యలో ఆహార పదార్థాలు వడ్డించే విధానానికి స్వస్తి పలికారు. ఈ విధానం వలన ఆహార పదార్థాలు భారీగా వృథా అవుతున్నాయని వీరు గ్రహించారు. రెండు కూరలు, పప్పు, పులుసు, పచ్చళ్లు, పొడులు, రెండు రకాల స్వీట్లు వడ్డించారు. రాత్రికి రెండు కూరలు, పుల్కా, చపాతి, సాంబర్, అన్నం, పెరుగు, రెండు రకాల స్వీట్లు అందించారు. ఐస్‌ను ఎక్కడా వినియోగించలేదు. ఐస్‌క్రీమ్‌కు వీరి మెనూలో చోటు కల్పించలేదు. 

మరిన్ని వార్తలు