సగం ధరకే సాగు పరికరాలు

25 Feb, 2014 00:15 IST|Sakshi

 జిల్లాకు రూ.13.27 కోట్ల నిధులు
  రైతుల కష్టాలకు విరుగుడు
  కూలీల కొరతకు పరిష్కారం
 
 సాక్షి, ఏలూరు : సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో నష్టాలను చవిచూస్తున్న అన్నదాతకు ఆసరాగా నిలిచే ఆధునిక యంత్ర పరికరాలు సగం ధరకే అందుబాటులోకి వస్తున్నారుు. వీటి ధరలు భారీగా ఉండటంతో చిన్న, సన్నకారు రైతులు కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొనడంతో వాటిని సబ్సిడీపై అందించేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాకు రూ.13.27 కోట్ల నిధులు కేటారుుంచారుు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్ నుంచి రూ.3.46 కోట్లు కేటాయిం చగా, ఇప్పటివరకూ జిల్లాలో రూ.1.62 కోట్లు సబ్సిడీగా అందజేశారు. మిగిలిన నిధులను వచ్చే నెలాఖరు నాటికి రైతులకు అందించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ ద్వారా రూ.1.35 కోట్లు అందించింది. దీనిలో రూ.28 లక్షలు మాత్రమే ఇప్పటివరకూ రైతులకు సబ్సిడీ రూపంలో అందించగలిగారు. కేంద్ర ప్రభుత్వం మరో పథకం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా కూడా నిధులు అందజేస్తోంది. ఈ ఏడాది ఈ పథకం కింద జిల్లాకు రూ.8.46 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రూ.2.12 కోట్లను రైతులు సబ్సిడీగా పొందారు. కేంద్రం ఇచ్చే నిధులు వినియోగించడానికి గడువు అనేది లేకపోవడంతో రైతులు ఎప్పుడైనా సబ్సిడీ పొందే అవకాశం ఉంది.
 
 సబ్సిడీలో ఇవి పొందవచ్చు
 రాష్ట్ర బడ్జెట్ నుంచి ట్రాక్టర్ పనిముట్లకు రూ.70 లక్షలు, డీజిల్ ఇంజిన్లకు రూ.40 లక్షలు, పవర్ టిల్లర్లకు రూ.55 లక్షలు, మినీ ట్రాక్టర్లకు రూ.15.58 లక్షలు, రోటోవేటర్లకు రూ.85.80 లక్షలు కేటాయించారు. యంత్రం ఖరీదు రూ.లక్ష లోపు ఉండే యంత్రాలకు 50 శాతం సబ్సిడీ ఇచ్చేందుకు రూ.18.50 లక్షలు, రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ విలువ ఉండే యంత్రాలపై 40 శాతం సబ్సిడీ ఇచ్చేందుకు రూ.8.50 లక్షలు విడుదల చేశారు. నాలుగు వరి కోత యంత్రాలకు ఒక్కొక్క దానికి రూ.5 లక్షలు చొప్పున రూ.20 లక్షలు అందించడానికి నిధులు ఉన్నాయి. జాతీయ ఆహార భద్రత మిషన్ ద్వారా పంపుసెట్లకు ఒక్కోదానికి రూ.10 వేల చొప్పున రూ.87 లక్షలు ఇచ్చేందుకు నిధులు సిద్ధం చేశారు. స్ప్రేయర్లను సబ్సిడీపై ఇచ్చేందుకు రూ.38 లక్షలు ఉన్నాయి. అయితే తైవాన్ స్ప్రేయర్లకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించనందున వేరే కంపెనీ స్ప్రేయర్లు అందించనున్నారు. మినీ ప్యాకే జీ ద్వారా ఖరీదైన యంత్ర పరికరాలపై సబ్సిడీ ఇచ్చేందుకు రూ.30 లక్షలు, చిన్న కోత యంత్రాలకు రూ.20 లక్షలు, మొక్కజొన్న వలిచే యంత్రాలకు రూ.11 లక్షలు, టార్పాలిన్లకు రూ.76 లక్షలు, కలుపు యం త్రాలకు రూ.9 లక్షలు కేటాయింపులు ఉన్నా యి. కోతలు పూర్తయ్యాక ధాన్యం సేకరణకు రూ.90 లక్షలు వెచ్చించనున్నారు.
 
 రూ.13.27 కోట్ల నిధులొచ్చారుు
 వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ ఇచ్చేందుకు జిల్లాకు రూ.13.27కోట్లు  నిధులు వచ్చాయి. వాటిలో రూ.4.04 కోట్లు రైతులకు అందజేశాం. మిగిలిన సొమ్ము రూ.9.25కోట్లు రైతులకు ఇవ్వడానికి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది. యంత్ర పరికరాల సేవా కేంద్రాలు వృద్ధి చేయాలని నిర్ణయించాం. రైతులు ఏవైనా కొన్ని వ్యవసాయ యంత్రాలకు కలిపి రూ.2.50 లక్షల వరకూ సబ్సిడీ పొందవచ్చు. దీనికోసం రూ.1.88 కోట్లు కేటాయించాం. సబ్సిడీపై యంత్రాలు కావాల్సిన వారు వెంటనే స్థానిక వ్యవసాయాధికారులను సంప్రదించవచ్చు. రూ.3 వేల నుంచి రూ.5 లక్షల వరకూ యంత్రం ఖరీదును బట్టి సబ్సిడీ ఇచ్చేందుకు నిధులు పుష్కలంగా ఉన్నాయి. సాగులో యంత్రాల వినియోగం వల్ల సకాలంలో పనులు జరిగి పెట్టుబడి తగ్గడంతో పాటు అధిక దిగుబడులు వస్తాయి.           
   - వీడీవీ కృపాదాస్, వ్యవసాయ శాఖ డెప్యూటీ డెరైక్టర్
 
 రైతు గ్రూపులకూ  యంత్రాలు
 రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా ఖరీదైన యంత్రాలను రైతు గ్రూపులకు సబ్సిడీపై అందించనున్నారు. వరికి సంబంధించి 11 ఎస్‌ఐఎస్‌ఆర్‌ఎం సెంటర్లను ఇవ్వనున్నారు. ట్రాక్టర్ మినహా వరినాటు యంత్రం, నారుమడి వేసే యంత్రం, ప్లాస్టిక్ ట్రేలు, కలుపు తీసే యంత్రాలు, భూమి చదును చేసే యంత్రాలపై 50శాతం సబ్సిడీ రూపంలో రూ.1.74 లక్షలు ఇస్తారు. మినీ ప్యాకేజీ ద్వారా 12 సెంటర్లు ఏర్పాటు చేసుకుని రూ.67.20 లక్షలు సబ్సిడీ తీసుకోవచ్చు. 45 హెచ్‌పీ ట్రాక్టర్‌కు రూ.1.50 లక్షలు, 55హెచ్‌పీ ట్రాక్టర్‌కు రూ.2 లక్షలు సబ్సిడీ అందిస్తారు. 5 కస్టమ్స్ హైరింగ్ సెంటర్‌ను రైతులు పొంది వాటి ద్వారా మొక్కజొన్న యంత్రాలకు కేటాయించిన రూ.77.50 లక్షలను పొందవచ్చు. 12 పొగాకు సెంటర్లు తీసుకుని రూ.48.60 లక్షలు తీసుకోవచ్చు.
 
 

మరిన్ని వార్తలు