అనుసంధానంతోనే అభివృద్ధి

5 May, 2016 02:16 IST|Sakshi
అనుసంధానంతోనే అభివృద్ధి

వంశధార నిర్వాసితులకు రూ.350కోట్లతో ప్యాకేజీ: సీఎం
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నాగావళి, వంశధార నదుల అనుసంధానంతో శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం పట్టణంలోని కోడి రామ్మూర్తి స్టేడియం పునఃనిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ‘నీరు-ప్రగతి’ అవగాహన సదస్సులో సీఎం మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు పనుల సత్వర పూర్తికి ఫాస్ట్‌ట్రాక్‌లో టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. నిర్వాసితులకు అవసరమైతే రూ.350 కోట్ల వరకూ ఖర్చు చేసైనా ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు.

 శ్రీకాకుళం పర్యటనలో సీఎంకు చేదు అనుభవం ఎదురైంది. సింగుపురం రెవెన్యూ పరిధిలోని అల్లి చెరువు వద్ద చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలనకు వెళ్లిన ఆయనఅక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి సమీప గ్రామాల నుంచి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అందరూ మరుగుదొడ్లు కట్టుకున్నారా? అని ప్రశ్నించారు. దీనికి లేదని మహిళలంతా సమాధానమిచ్చారు. ‘మరుగుదొడ్డి కట్టుకోవాలి. లేదంటే మహిళల ఆత్మగౌరవానికి భంగం కలుగుతుంది. పదిహేను వేల రూపాయలు వస్తాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోండి’ అంటూ చంద్రబాబు సూచించారు. దీంతో బైరివానిపేటకు చెందిన ఓ మహిళ స్పందిస్తూ... ‘ముందు కట్టుకున్న మరుగుదొడ్లకే బిల్లులు ఇవ్వట్లేదు.

మిగతావాళ్లు కట్టుకున్నా ఉపయోగమేమిటి?’ అని ప్రశ్నించింది. మరో మహిళ లేచి... ‘గతంలో కట్టిన ఇళ్లకూ బిల్లులు ఇవ్వలేదు. ఇల్లు కట్టుకుందామని అంతకుముందున్న ఇల్లును కూల్చేసుకున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రెండేళ్లయ్యింది... కొత్త ఇళ్లు ఒక్కటైనా ఇచ్చారా? ఇప్పటికీ ఏ ఒక్కరికీ మంజూరు లేదు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు రూ.3 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ, వడ్డీ మాఫీ చేశామన్నారు. దీంతో మరో మహిళ లేచి... వడ్డీలను పొదుపు నుంచి జమ చేశారని, పొదుపు చేసిన మొత్తానికి వడ్డీ ఇవ్వడం లేదని సీఎం దృష్టికి తీసుకొచ్చింది. తీరా ఆ రూ.3 వేలు కూడా బ్యాంకు వాళ్లు ఇవ్వట్లేదని, ఇక వాటివల్ల లాభమేమిటని ప్రశ్నించింది. దీనికి సీఎం సమాధానమిస్తూ రూ.3 వేలు చొప్పున మరో నెలలో జమ చేస్తామని, అంతకు ఎనిమిది రెట్లు ఎక్కువగా వడ్డీ లేని రుణాలిస్తామని చెప్పారు. అయినా సీఎం సమాధానాలతో సంతృప్తి చెందని మహిళలు మరికొంత మంది ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. ఇది గమనించిన చంద్రబాబు మరో కార్యక్రమానికి సమయం కావస్తోందంటూ అక్కడి నుంచి వెనుదిరిగారు.
 
 ఇష్టానుసారం మాట్లాడుతున్న కేసీఆర్
 కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి అడిగితే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం రాష్ట్రానికి వెయ్యి టీఎంసీల నీరు రావాల్సి ఉంటే కేవలం 85 టీఎంసీలు మాత్రమే దక్కాయని వెల్లడించారు. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తయితే కృష్ణా డెల్టాలో సాగుకు నీరు కరువయ్యే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. రాష్ట్రం హక్కుల కోసం రాజీపడబోమన్నారు.

మరిన్ని వార్తలు