మన పాలన.. మీ సూచన

25 May, 2020 02:02 IST|Sakshi

నేటి నుంచి 30 వరకు మేధోమథన సదస్సులు

తొలిరోజు ‘పరిపాలన–సంక్షేమం’పై సీఎం జగన్‌ అధ్యక్షతన సమావేశం

మొదటి ఏడాదిలో జరిగిన సంక్షేమం, పాలన వికేంద్రీకరణపై సమీక్ష

పైసా అవినీతి లేకుండా కుల, మత, పార్టీలకు అతీతంగా పేదలకు సంక్షేమ ఫలాలు

భవిష్యత్‌లో చేపట్టాల్సిన సంస్కరణలపైనా దృష్టి

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లబ్ధిదారులు, నిపుణులతో భేటీ

తొలి ఏడాదిలోనే పేదలందరికీ సంక్షేమ ఫలాలు

గ్రామ, వార్డు సచివాలయాలతో పరిపాలన వికేంద్రీకరణ

వీటి ద్వారా మొత్తం 534 సేవలు ప్రజల ముంగిట్లో

వైఎస్సార్‌ నవశకం పేరుతో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

కార్యాలయాల చుట్టూ తిప్పకుండా ఇంటి దగ్గరకే సేవలు.. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో పరిష్కారం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఏడాది కాలంగా అమలుచేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ‘మన పాలన–మీ సూచన’ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ఈనెల 30 వరకు రోజూ రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మేథోమధన సదస్సులు నిర్వహిస్తోంది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి ఈ నెల 30 నాటికి ఏడాది పూర్తవుతుండడంతో సోమవారం ‘పరిపాలన–సంక్షేమం’పై సీఎం అధ్యక్షతన మొదటి సదస్సు జరగనుంది. జిల్లా స్థాయిలో పథకాల లబ్ధిదారులు, ఆయా రంగాల నిపుణులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడతారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన వాటిపై వారి నుంచి సలహాలు, సూచనలను తీసుకుంటారు. ఈ సదస్సు ఉ.10.30 గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రారంభం కానుంది. సదస్సులో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స కూడా పాల్గొంటారు.

ఈ నేపథ్యంలో.. పరిపాలన–సంక్షేమం, ఈ రెండు అంశాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలా అమలయ్యాయి? ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఏడాది పాలనలో ఎలా ఉందో..

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఇలా..
► టీడీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు జన్మభూమి కమిటీల కంబంధ హస్తాల్లో నలిగిపోయారు. 
► ఆ కాలంలో వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
► రేషన్‌ కార్డు, పింఛన్‌.. ఇలా ఏ సంక్షేమ పథకం కావాలన్నా ఆ కమిటీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వచ్చేది. 
► ఈ కమిటీల సిఫార్సులతో పాటు సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులు ఆఖరికి ముఖ్యమంత్రి ఆమోదిస్తేగానీ అవి మంజూరయ్యేవి కావు. 
► సచివాలయానికి వచ్చినా అవి మంజూరు కావడం ఎండమావిగానే ఉండేది.
► టీడీపీ సానుభూతిపరులకే అన్నీ అందేవి. 
► మిగిలిన వారి దరఖాస్తులను నిర్దాక్షిణ్యంగా బుట్టదాఖలు చేసేవారు.

ఇప్పుడు ఇంటివద్దకే పరిపాలన
తెలుగుదేశం హయాం నాటి దుర్భర పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఏడాది కిందట అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వైఎస్‌ జగన్‌ కొద్దిరోజుల్లోనే పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి నాటి నుంచి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రమంతా ఆవిష్కరించారు. పాదయాత్రలో ప్రజలకిచ్చిన మాట మేరకు.. ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల ద్వారా పరిపాలన వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి దగ్గరకే ప్రభుత్వ పాలనను తీసుకువెళ్లారు. ఎలాగంటే..

► రాష్ట్రవ్యాప్తంగా 15,003 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారు.
► వీటిలో 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలను కల్పించారు.
► అలాగే, మరో 2.70 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లను నియమించారు.
► గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ల బాధ్యతలు ఒక గ్రామ వలంటీర్‌కు.. పట్టణాల్లో ప్రతీ 100 ఇళ్ల బాధ్యతలు ఓ వార్డు వలంటీర్‌కు అప్పగించారు.
► గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 534 సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
► ఎవరికైనా రేషన్‌ కార్డు, పింఛను, సర్టిఫికెట్టు, ఆరోగ్యశ్రీ కార్డు ఇలా ఏదైనా సర్వీసు కావాలంటే వలంటీర్‌కు చెప్పి దరఖాస్తు చేస్తే చాలు. ఇక ఎవ్వరి దగ్గరకు ప్రజలు వెళ్లక్కర్లేదు.
► సచివాలయం, మండల కార్యాలయాలు, ప్రజాప్రతిని« దులు చుట్టూ కూడా తిరగాల్సిన పనేలేదు.
► సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల సిఫార్సుల అవసరమే లేదు.
► అర్హులైన వారందరికీ ఇంటి దగ్గరకే ప్రభుత్వ ఫలాలు వచ్చి చేరుతున్నాయి.
► గ్రామ సచివాలయంలో లబ్ధిదారుల అర్హతలను ఈ వలంటీర్లు పరిశీలించి ఆన్‌లైన్‌లో సంబంధిత సెంట్రల్‌ సర్వర్‌కు వారి దరఖాస్తులను పంపుతున్నారు.
► సంబంధిత శాఖ మరోసారి అర్హతపై ఆన్‌లైన్‌లోనే తనిఖీలు నిర్వహిస్తోంది.
► అర్హత ఉందా లేదా అనే సిఫార్సుతో 72 గంటల్లో గ్రామ సచివాలయానికి తిరిగి దరఖాస్తు వస్తుంది.
► అంతే.. గ్రామ సచివాలయంలో అర్హత ఉన్న వారికి వెంటనే సంబంధిత కార్డు ప్రింట్‌ చేసి వలంటీర్‌ ద్వారా ప్రజల ఇళ్లకు అందజేస్తారు.
► అర్హత లేదని తేలితే మరోసారి మూడో పార్టీ ద్వారా తనిఖీ చేస్తారు. అనంతరం దరఖాస్తుదారునికి తెలియబరుస్తారు. 
► ఇందుకనుగుణంగా అధికార యంత్రాంగం ఆన్‌లైన్‌ వ్యవస్థను రూపకల్పన చేసింది.
► అంతేకాదు.. అధికార వికేంద్రీకరణను చేపట్టడంతో పాటు పాలనలో జవాబుదారీ, పారదర్శకతను ప్రభుత్వం తీసుకువచ్చింది.
► ఇందులో భాగంగా ఈ పథకాల మంజూరు అధికారాన్ని తహసీల్దారుకు అప్పగించారు. 
► తహసీల్దారు 12 గంటల్లోగా మంజూరు చేయడమో లేదా తిరస్కరించడమో చేయాలి. అలా చేయకపోతే ఆటోమేటిక్‌గా మంజూరు అయ్యేలా ఆన్‌లైన్‌ వ్యవస్థను రూపకల్పన చేశారు. 
► ఇది నిరంతరం జరిగే ప్రక్రియగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.

లబ్ధిదారుల గుర్తింపునకు ఇంటింటి సర్వే
ఇదిలా ఉంటే.. వైఎస్సార్‌ నవశకం పేరుతో నవరత్నాల్లోని పథకాలన్నింటికీ సంతృప్త (శాచురేషన్‌) స్థాయిలో అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించింది. ఆయా పథకాల పరిధిలోకి మరింత ఎక్కువమంది లబ్ధిదారులు వచ్చేందుకు వీలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అర్హత నిబంధనలు సడలిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అర్హులను  వలంటీర్ల ద్వారా గుర్తించి.. ఫలాలను వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఇప్పించారు. వార్షిక ఆదాయం ఐదు లక్షలలోపు ఉన్న వారందరికీ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేశారు. దీంతో రాష్ట్రంలోని 95 శాతానికి పైగా జనాభాకు ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరుచేసి ఆరోగ్య భరోసా కల్పించారు. 

చివరిగా..  నవరత్నాల్లోని ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడానికి రాజకీయాలు, పార్టీలు, మతాలు, కులాలు, ప్రాంతాలు చూడబోమని, అర్హత ఉంటే చాలు.. వారికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని, పైసా లంచం ఇవ్వకుండానే ప్రయోజనాలను నేరుగా ఇంటికి పంపిస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ రాష్ట్రంలో అక్షరాలా నిజమవుతోంది. 

మరిన్ని వార్తలు