నోట్లు విసిరిన మంత్రాలయం మఠాధీశులు.. తీవ్ర వివాదం

24 Aug, 2019 07:59 IST|Sakshi

శ్రీమఠంలో ఉక్కిరిబిక్కిరి వాతావరణం 

పీఠాధిపతికి మద్ధతుగా ర్యాలీ చేస్తామంటూ హడావుడి

అనుకోకుండా ర్యాలీ విరమించుకున్న మఠం ఉద్యోగులు 

సాక్షి, మంత్రాలయం : కరెన్సీ నోట్లు విసరడం శ్రీమఠంలో దుమారమే రేపుతోంది. మఠాధీశులను మొదలు అధికారులను ఓ కుదుటున కూర్చోనివ్వకుండా చేస్తోంది. అనుకోని పరిణామాలతో ఆందోళన రేకెత్తించింది. ఊహించని రీతిలో వి.నారాయణ అనే భక్తుడు పీఠాధిపతి సబుదేంద్రతీర్థులపై కేసు నమోదు చేయాలంటూ స్టేషన్‌ మెట్లు ఎక్కడం.. ఈ వార్త కర్ణాటక, ఆంధ్ర మీడియాల్లో  హైలెట్‌ కావడంతో మఠంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు హడావుడి నెలకొంది. ఉదయం పీఠాధిపతికి మద్ధతుగా టీడీపీ నాయకులు ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మఠం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సాయంత్రం ఏకమై భారీ ర్యాలీ చేపట్టాలని పిలుపు నిచ్చారు.

ఈ మేరకు వందలాది మంది నాయకులు, అనునయులు మఠంలోనే తిష్ట వేసి పరిస్థితిపై మల్లాగుల్లాలు చేశారు. నాయకులు, అధికారులు చర్చించుకున్న తర్వాత సీఐ కృష్ణయ్యను పిలిచి కేసు విషయంపై ఆరా తీశారు. ఆందోళన చేయడంతో సమస్య మరింత జఠిలంగా మారే అవకాశం ఉందని ఆయన సూచించినట్లు సమాచారం. సాయంత్రం సంఘం నాయకులు ఇంజినీర్‌ సురేష్‌ కోనాపూర్‌ సూచన మేరకు ఉద్యోగులు, సంభావణ కార్మికులు ర్యాలీకి సమాయత్తమవుతున్న తరుణంలో అనుకోకుండా   బ్రేక్‌ వేశారు. పీఠాధిపతి  సూచన మేరకు ఆందోళన విరమించుకున్నట్లు ఉద్యోగులకు తెలపడంతో అందరూ గమ్మున ఇంటి ముఖం పట్టారు.  

ఫిర్యాదు దారుడిపై రివర్స్‌ కేసుకు యోచన   
18 వ తేదీన రాఘవేంద్రుల మహారథంపై నుంచి పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు రూ.100 కరెన్సీ నోట్లు విసరడంతో కాస్త తొక్కిసలాట జరిగింది. దీనికి కారకులైన పీఠాధిపతిపై కేసు నమోదు చేయాలని స్థానిక భక్తుడు వి.నారాయణ గురువారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో    శుక్రవారం అధికారులు, సన్నిహితులతో కలిసి పీఠాధిపతి మంతనాలు చేశారు. నారాయణపై రివర్స్‌ కేసు పెట్టాలని యోచించారు. విషయాన్ని పెద్దది చేయడం ఎందుకని సూచించడంతో పీఠాధిపతి రివర్స్‌ కేసు అంశాన్ని వెనక్కి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా అనుకోని సంఘటన దుమారం రేగడంతో మఠంలో ఉత్కంఠ నెలకొంది. ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా