ఆ రెండు పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి 

27 Jan, 2020 04:52 IST|Sakshi

నైతికత, మానవ విలువలు.. పర్యావరణ విద్యపై ఇంటర్‌ బోర్డు నిర్ణయం 

పాస్‌ కాకుంటే ఇంటర్‌ ఫైనల్‌ సర్టిఫికెట్ల జారీ నిలిపివేత 

ఈ నెల 28, 30 తేదీల్లో పరీక్షలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్య సబ్జెక్టులలో విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణణ సాధించాల్సి ఉంది. ఇప్పటి వరకూ నామమాత్రంగా జరిగిన ఈ పరీక్షలను ఇంటర్మీడియెట్‌ బోర్డు కఠినతరం చేసింది. ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించని వారికి సెకండియర్‌ పరీక్షలు పూర్తి చేసిన తరువాత ఇచ్చే పాస్‌ ధ్రువీకరణ పత్రాన్ని బోర్డు జారీ చేయబోదు. ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు ఆ రెండు పరీక్షలను ఈ నెల 28, 30 తేదీల్లో నిర్వహించేందుకు బోర్డు గతంలోనే షెడ్యూల్‌ను విడుదల చేసింది.

28వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నైతికత, మానవ విలువలు, 30న పర్యావరణ విద్య సబ్జెక్టుల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షల్లో పాస్‌ కావడానికి విద్యార్థులు 35 మార్కులు సాధించాలి. నైతికత, మానవ విలువల సబ్జెక్టులో 60 మార్కులు పరీక్షకు, 40 మార్కులు ప్రాజెక్టు వర్క్‌కు కేటాయించారు. అలాగే పర్యావరణ విద్య సబ్జెక్టులో 70 మార్కులు పరీక్షకు, 30 మార్కులు ప్రాజెక్టు వర్క్‌కు కేటాయించారు. గతంలో ఈ పరీక్షలకు హాజరుకానివారు, హాజరైనా పరీక్షలో ఉత్తీర్ణత సాధించని సెకండియర్‌ విద్యార్థులు తమ ఫస్టియర్‌ హాల్‌ టికెట్‌ నంబర్‌తో ఈ పరీక్ష రాయవచ్చు. 

ఆన్‌లైన్‌ ప్రశ్న పత్రాల ద్వారా పరీక్షలు
నైతికత, మానవవిలువలు, పర్యావరణ విద్య, ప్రాక్టికల్‌ పరీక్షలను ఇంటర్‌ బోర్డు ఆన్‌లైన్‌ ప్రశ్నపత్రాల ద్వారా నిర్వహించనుంది. ముద్రించిన ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు పంపే పద్ధతికి స్వస్తి పలికింది. పరీక్ష సమయానికి ముందు ఇంటర్‌ బోర్డు ఈ ఆన్‌లైన్‌ ప్రశ్న పత్రాన్ని విడుదల చేయనుంది. ఈ ప్రశ్న పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకునే విధానాన్ని ఏపీ ఇంటర్మీడియెట్‌ బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. 

ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్‌
ఇంటర్మీడియెట్‌ (జనరల్‌) సెకండియర్‌ విద్యార్థులకు, ఇంటర్మీడియెట్‌ (ఒకేషనల్‌) ఫస్టు, సెకండియర్‌ విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి. దీనికోసం ఇంటర్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 20వ తేదీ వరకు నాలుగు దశల్లో నిర్వహించనున్నారు. ఈ ప్రాక్టికల్‌ పరీక్షలకు జంబ్లింగ్‌ పద్ధతిలో కేంద్రాలు కేటాయిస్తున్నారు. ఇన్విజిలేటర్లను కూడా ఇదే విధానంలో పరీక్ష కేంద్రాల్లో నియమించనున్నారు. ఈ ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను https://bie.ap.gov.in వెబ్‌సైట్‌లో ఇంటర్‌ బోర్డు పొందుపరిచింది. 

మరిన్ని వార్తలు