మూగమనసులు ఒక్కటయ్యాయి..!

28 Jun, 2019 14:14 IST|Sakshi
వివాహానికి హాజరయిన రాష్ట్ర వ్యాప్త బధిర విద్యార్థులు

ఉలవపాడులో బధిరుల ఆదర్శవివాహం

హాజరైన బధిర విద్యార్థులు

సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): వారిద్దరు మాట్లాడలేరు. వినలేరు.. కానీ వారి మనస్సులు మాట్లాడుకున్నాయి. సైగలతోనే జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరి తల్లిదండ్రులు అంగీకరించడంతో మూగమనసులు ఒక్కటయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఉలవపాడు గ్రామానికి చెందిన  కంబోతుశ్రీనివాసులు, శ్రీలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ దివ్యాంగులే... వినపడదు, మాట్లాడలేరు. వీరిలో భార్గవి ఒంగోలులోని బధిరుల పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకుంది. అక్కడే ఉలవపాడు మండలం అలగాయపాలెంకు చెందిన పాదాల సత్యనారాయణ, ఈశ్వరమ్మల కుమారుడు పవన్‌కుమార్‌ కూడా చదివాడు. అతనికి కూడా వినపడదు, మాట్లాడలేడు. అక్కడ వారికి పరిచయం ఏర్పడింది.

తరువాత తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడిచే బధిరుల పాఠశాలలో ఐటీఐ చదివారు. అక్కడ వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. కలిసి జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నారు. ఇద్దరి కులాలు వేరయినా ఆదర్శ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు, తోటి మిత్రులకు తెలియజేశారు. తల్లిదండ్రులు కూడా సమ్మతి తెలపడంతో గురువారం శింగరాయకొండలోని లక్ష్మీనరశింహస్వామి దేవస్థానంలో వివాహం జరిపించారు. అనంతరం ఉలవపాడు సాయిబాబా గుడికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బధిరులు ఈ వివాహానికి వాట్సప్‌ గ్రూప్‌ల ద్వారా తెలుసుకుని 50 మంది హాజరయ్యారు.

మరిన్ని వార్తలు