అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

14 Sep, 2013 04:37 IST|Sakshi

 విజయవాడ, న్యూస్‌లైన్ : తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే అంతర్ జిల్లా దొంగల ముఠాను విజయవాడలోని కృష్ణలంక పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.11 లక్షల విలువైన సొత్తును స్వాధీనపర్చుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కృష్ణలంక పోలీస్‌స్టేషన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో డీసీపీ రవిప్రకాష్ వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం..
 
 విజయవాడ నగరంలోని వాంబే కాలనీకి చెందిన దేవరకొండ రాంబాబు(42) గత 20 ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్నాడు. నగరంలోని వివిధ స్టేషన్లలో, జిల్లాలోని పామర్రు, హనుమాన్ జంక్షన్, గుడివాడతోపాటు గుంటూరు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్‌స్టేషన్లలో ఇతడిపై కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడేనికి చెందిన ఊబిద ఆంజనేయులు(32) గత పదిహేనేళ్లుగా దొంగతనాలు చేస్తున్నాడు. ఇతడిపై హైదరాబాద్‌లోని వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు లో వీరిద్దరూ శిక్ష అనుభవిస్తుండగా పరిచ యం ఏర్పడి, స్నేహంగా మారింది.  గుం టూరు జిల్లా రైలుపేటకు చెందిన షేక్ జాన్‌బాషా(35) మిర్యాలగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలో డీజిల్ దొంగతనం కేసులో అరెస్టయి అదే జైలుకు వెళ్లాడు. అక్కడ రాంబాబుతో బాషాకు పరిచయం ఏర్పడింది.
 
 గత జూన్ నెలలో రాంబాబు, ఆంజనేయులు జైలు నుంచి విడుదలై బాషాను కలిశారు. అప్పటి నుంచి వీరు వాంబే కాలనీలో నివాసముంటూ దొంగతనాలు చేస్తున్నారు. నల్గొండకు చెందిన కారును దొంగిలించి, అందులోనే వివిధ ప్రాంతాలకు వెళ్లి తాళం వేసిన ఇళ్లను గుర్తించేవారు. ఆ తరువాత ఆ ఇళ్ల యజమానుల గురించి ఆరా తీసేవారు. రాత్రిళ్లు ఆ ఇళ్లలో దొంగతనాలు చేసేవారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో; గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, వినుకొండ, నల్లపాడులో; నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో; ప్రకాశం జిల్లాలో; ఖమ్మం నగరంలో; ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరాలో; హైదరాబాద్ నగరంలో వీరు దొంగతనాలు చేశారు. విజయవాడలో చోరీలకు సంబంధించి సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా వేసి, ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా వీ రు నేరాలు అంగీకరించారు. వీరి నుంచి 167 గ్రాముల బంగారు ఆభరణాలు, 4.2 కిలోల వెండి వస్తువులు, ఐదు ల్యాప్‌టాప్‌లు, ఒక కెమెరాను స్వాధీనపర్చుకున్నట్టు డీసీపీ తెలిపారు. సమావేశంలో ఏసీపీ నాగేశ్వరరావు, కృష్ణలంక సీఐలు టిఎస్‌ఆర్‌కె.ప్రసాద్, ప్రసాద్, అడిషనల్ సీఐ సువర్ణరాజు, ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు