హైస్కూళ్లలోనే ఇంటర్‌

14 Jul, 2020 08:48 IST|Sakshi

విద్యార్థుల సంఖ్య ఆధారంగా అప్‌గ్రేడ్‌  

మండల కేంద్రాల్లోని     పాఠశాలలకు అవకాశం

విద్యార్థులకు తగ్గనున్న దూరాభారం

బాలికల డ్రాపౌట్స్‌కు శాశ్వత పరిష్కారం

గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య చేరువవుతోంది. ప్రతిభతో ‘పది’ గట్టెక్కినా దూరాభారంతో  ‘ఇంటర్‌’ చదువు ఇరుకున పెట్టేది. అందువల్లే ఇంటర్‌లో చేరినా డ్రాపౌట్స్‌ సంఖ్య ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత బాలికలు పట్టణాలకు రాకపోకలు సాగించడం ఇబ్బందిగా మారి వారి భవితే మారిపోయేది. ఇవన్నీ గమనించిన     వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం హైస్కూల్‌లోనే  ఇంటర్‌ విద్య అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 37  హైస్కూళ్లను అప్‌గ్రేడ్‌ చేయనుండగా.. గ్రామీణ విద్యార్థులకు మేలు జరుగుతోంది.

అనంతపురం విద్య: విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ఉన్నత పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా మండల కేంద్రంలోని  ఉన్నత పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో గత వారంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులతో సమావేశం కూడా నిర్వహించారు. పదో తరగతి ఉత్తీర్ణులైనా ఇంటర్‌ చదివేందుకు ఎందుకు ఉత్సాహం చూపడం లేదనే అంశం సమావేశంలో చర్చకు రాగా... దూరభారం వల్లే సమస్య తలెత్తుతోందని అందరూ అంగీకరించారు. ఈ నేపథ్యంలో మండల స్థాయిలో జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేస్తే ఇంటర్‌ కోర్సుల్లో అడ్మిషన్లను గణనీయంగా పెంచవచ్చని ఉన్నతాధికారులు భావించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా...ఆయన కూడా వెంటనే ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని మండల కేంద్రాల్లో జూనియర్‌ కళాశాలను ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

జిల్లాలో అదనంగా 37 జూనియర్‌ కళాశాలలు
జిల్లాలో 63 మండలాలుండగా.. 25 మండలాల్లో మోడల్‌ పాఠశాలలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం 37 ఉన్నత పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయనుంది. కార్పొరేట్‌ ,ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంటర్‌ తరగతులు బోధించడం వల్ల అనేక మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందించినట్లు అవుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. మండలాల్లోనే జూనియర్‌ కళాశాల ఏర్పాటు గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు వరంగా మారనుందని అందరూ భావిస్తున్నారు. ఈ అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నత పాఠశాలలను ఇంటర్‌ తరగతులను బోధించే వీలుగా అప్‌గ్రేడ్‌ చేయనుంది.

జూనియర్‌ కళాశాలలు ఏర్పాటయ్యే మండలాలివే
జిల్లాలోని ఆత్మకూరు, బత్తలపల్లి, బొమ్మనహాల్, బ్రహ్మసముద్రం, బుక్కరాయసముద్రం,  చెన్నేకొత్తపల్లి, గాండ్లపెంట, గార్లదిన్నె, గుడిబండ, గుమ్మఘట్ట, హాల్కూర్, కంబదూరు, కణేకల్లు, కుందుర్పి, లేపాక్షి, ముదిగుబ్బ, నల్లచెరువు, నల్లమాడ, నంబులపూల కుంట, ఓడీ చెరువు, పరిగి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పుట్లూరు, రామగిరి, రాప్తాడు, రొద్దం, రొళ్ల, శెట్టూరు, శింగనమల, సోమందేపల్లి, తాడిమర్రి, తనకల్లు, వజ్రకరూరు, విడపనకల్లు, యాడికి, యల్లనూరు తదితర మండల కేంద్రాల్లో జూనియర్‌ కళాశాలలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.  

మరిన్ని వార్తలు