ఇక కేజీబీవీ జూనియర్‌ కళాశాలలు

5 Jun, 2019 11:56 IST|Sakshi

పేద బాలికలకు వరం

ఈ ఏడాది నుంచి 14 కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య

వృత్తి విద్య కోర్సులు అమలు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

బి.కొత్తకోట: జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికల (కేజీబీవీ) విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్‌ విద్యను ప్రారంభిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యకు దూరమైన, ఆలనాపాలనా చూసేవారు లేని అనాథ బాలికల విద్య కోసం 20 కేజీబీవీలను జిల్లాలో 2004–05 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. ఇందులో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. హాస్టల్‌ వసతి, భోజనం, దుస్తులు తదితర వాటిని సమకూర్చుతున్నారు. గత ప్రభుత్వం గత ఏడాది జిల్లాలోని 20 కేజీబీవీల్లో కేవలం రామకుప్పం, గంగవరం విద్యాలయాల్లో మాత్రమే ఇంటర్‌ విద్యను ప్రవేశపెట్టింది.

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్యలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 14 కేజీబీవీల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీటితో కలుపుకుని జిల్లాలో 16 కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య బోధించనున్నారు. ఎర్రావారిపాళ్యం, కేవీబీపురం, కురబలకోట, తంబళ్లపల్లె కేజీబీవీల్లో మాత్రం పదో తరగతి వరకే విద్య అందుతుంది.

పేద బాలికలకు వరం
కేజీబీవీల్లో పది చదివిన తర్వాత పై చదువులకు వెళ్లలేని స్థితిలో బాలికలు విద్యకు దూరమవుతున్నారు. అలాంటి బాలికలకు ఇంటర్‌ విద్య వరంగా మారింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రారంభించే కోర్సుల్లో హెచ్‌ఈసీ, సీఈసీ, బైపీసీ కోర్సులేకాక బాలికలు వారి జీవితాల్లో ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా వృత్తిపరమైన కోర్సులను అమలు చేస్తున్నారు. దీనివల్ల బాలికలు ఇంటర్‌ పూర్తిచేయగానే సంపాదనకు మార్గం ఏర్పడుతుంది. తద్వారా బాలికల జీవితాల్లో మార్పు రావడమేగాక కుటుంబాలు ఆర్థికంగా బాగుపడతాయి.

తంబళ్లపల్లెలో నాలుగింటికి
జిల్లాలో 14 కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య మంజూరుకాగా అందులో నాలుగు కేజీబీవీలు తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందినవే. తంబళ్లపల్లె, కురబలకోట మండలాల్లో మాత్రమే ఇంటర్‌ విద్య ప్రారంభం కావాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు