నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

27 Feb, 2019 04:03 IST|Sakshi

10.17 లక్షల విద్యార్థులు.. 1,430 కేంద్రాలు

మాల్‌ప్రాక్టీస్‌ చేస్తే 8 పరీక్షల వరకు డీబార్‌

నిముషం ఆలస్యమైనా అనుమతించరు

ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 18వ తేదీతో ముగియనున్నాయి. బుధవారం ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం, మరుసటి రోజు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి మంగళవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించరని ఆమె చెప్పారు.

10.17 లక్షల విద్యార్థులు.. 1430 కేంద్రాలు
రాష్ట్రవ్యాప్తంగా 10,17,600 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రథమ సంవత్సరం 5,07,302 మంది, ద్వితీయ సంవత్సరం 5,10,298 మంది హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1430 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా 39 సెల్ఫ్‌ సెంటర్లలోనూ పరీక్షలకు అనుమతించారు. మొత్తం పరీక్ష కేంద్రాల్లో 113 సున్నిత, సమస్యాత్మకమైనవి ఉన్నట్లు గుర్తించారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కార్యదర్శి ఉదయలక్ష్మి తెలిపారు. పరీక్షలు సజావుగా సాగేందుకు ప్రతినిత్యం పర్యవేక్షణ ఉంటుందని, విజయవాడలోని బోర్డు కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.

ఏదైనా సమస్య ఉత్పన్నమయితే కంట్రోల్‌ రూమ్‌ను, ఫోన్‌ నంబర్‌ 0866–2974130 ద్వారా సంప్రదించవచ్చన్నారు. ఇది కాకుండా టోల్‌ఫ్రీ నంబర్‌ 18002749868  అందుబాటులో ఉంటుందని చెప్పారు. దాదాపు అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించినట్లు కార్యదర్శి తెలిపారు. హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టే కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని  స్పష్టం చేశారు. హాల్‌టికెట్లను జ్ఞానభూమి.ఏపీ.జీవోవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. హాల్‌టికెట్లపై ప్రిన్సిపాళ్ల సంతకాలను తప్పనిసరిగా చేయించాలని, లేనిపక్షంలో లోపలకు అనుమతివ్వబోరని స్పష్టం చేశారు. విద్యార్థులు కేంద్రాలను చేరుకోవడానికి వీలుగా ఐపీఈ సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. గూగుల్‌మ్యాప్‌ ఆధారంగా కేంద్రాలను తెలుసుకోవచ్చని ఉదయలక్ష్మి తెలిపారు. 

మాల్‌ప్రాక్టీస్‌ చేస్తే 8 పరీక్షల వరకు డీబార్‌
ఇలా ఉండగా పరీక్షల్లో విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌ తదితర తప్పుడు పద్ధతులకు పాల్పడితే వారిని 8 పరీక్షల వరకు డీబార్‌ చేస్తామని ఉదయలక్ష్మి తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీ అయ్యిందంటూ వచ్చే పుకార్లను నమ్మవద్దని, అలాంటి పుకార్లను వ్యాప్తి చేసే వారిపైనా చర్యలుంటాయని ఆమె స్పష్టం చేశారు. ఇలా ఉండగా పరీక్షలకు సంబంధించి బుధవారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు అనంతపురంలో సెట్‌పేపర్‌ను విడుదల చేయనున్నారు.  

తెల్లవారుజామున ప్రశ్నపత్రం సెట్‌ ఎంపిక
అనంతపురం ఎడ్యుకేషన్‌: మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలకు తెల్లవారుజామున 5.30 గంటలకు అనంతపురంలో ప్రశ్న పత్రాల సెట్‌ ఎంపిక చేయనున్నారు. పరీక్షలకు  1, 2, 3, సెట్ల ప్రశ్నపత్రాలను పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచారు. లాటరీ పద్ధతిలో మంత్రి గంటా ప్రశ్నపత్రం సెట్‌ ఎంపిక చేయనున్నారు. ఇంటర్‌ విద్య కార్యదర్శి ఉదయలక్ష్మి అధ్యక్షతన అనంతపురంలోని సూరజ్‌గ్రాండ్‌ హోటల్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది. సెట్‌ ఎంపిక అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం చేరవేసి ఉదయం 9కు పరీక్ష ప్రారంభానికి ముందు సెట్‌ను పరీక్షా కేంద్రాలకు తీసుకురానున్నారు. 
 

మరిన్ని వార్తలు