‘యువర్ సీట్’ పేరుతో ప్రత్యేక యాప్

3 Mar, 2020 18:03 IST|Sakshi

బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ రామకృష్ణ

సాక్షి, విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తొలిసారిగా ఇంటర్ బోర్డు  విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ రామకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేవిధంగా క్షేత్రస్థాయిలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. చివరి నిమిషంలో కళాశాల యాజమాన్యాలు వేధించకుండా, హాల్ టికెట్ జాప్యం చేయకుండా, ఆన్లైన్‌లో డౌన్లోడ్ చేసుకునే విధానాన్నిఇంటర్‌ బోర్డు తీసుకొచ్చిందన్నారు. ఇంటర్ పరీక్షలకు 10.65 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని వెల్లడించారు.

ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అరగంట ముందుగా పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు, హాల్ టికెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. దీంతో గతంలో ఫీజులు చెల్లించని విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా  వేధింపులకు గురిచేసే యాజమాన్యాలు తీరుకు చెక్ పెట్టనున్నారు. క్యూఆర్‌ కోడ్‌తో హాల్ టికెట్స్ నేరుగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉందని, ‘యువర్ సీట్’ పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించినట్లు వెల్లడించారు.

పరీక్ష కేంద్రాలు, ఇంటర్ బోర్డ్ తొలిసారిగా పరీక్షలు రాసే గది వివరాలు తెలిపే విధానాన్ని ప్రవేశ పెట్టిందని,  ఈ రోజు(మంగళవారం) రాత్రి 8 గంటలు నుంచి "నో యువర్ సీట్" సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1411  కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. టోల్ ఫ్రీ నంబర్‌ 0866 2974130, 18002749868 వాట్సాప్‌ నంబర్‌ 9391282578 ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు