నేల పరీక్షలు

13 Mar, 2014 03:04 IST|Sakshi

జిల్లాలో ఇంటర్‌మీడియెట్ పరీక్షలు బుధవారం అరకొర వసతుల మధ్య ప్రారంభమయ్యాయి. కనీస సౌకర్యాలకు కూడా నోచుకోక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కోట ఎస్సీ గురుకుల పాఠశాలలో 395 మందికి 365 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ కేంద్రంలో ఎన్‌బీకేఆర్, శ్రీనివాస, మల్లాం, కొత్తగుంట కళాశాలల విద్యార్థులు పరీక్షలు రాశారు. ఓ గదిలో విద్యార్థులకు బెంచీలు కేటాయించకపోవడంతో నేలపైనే కూర్చొని పరీక్షలు రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బెంచీలు అందుబాటులో లేవని ప్రిన్సిపల్ సూర్య చెప్పడం గమనార్హం.
 
 నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యా యి. విద్యార్థులకు తెలుగు, సంస్కృ తం, ఉర్దూ పేపర్-1 పరీక్షలు నిర్వహిం చారు. ఇందులో జనరల్ విద్యార్థులు 27,529 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,115 మంది కలిపి 28,644 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండ గా జనరల్ విద్యార్థులు 1,332 మంది, ఒకేషనల్ విద్యార్థులు 135 మంది కలిపి 1,267 మంది గైర్హాజరయ్యారు. సిట్టింగ్, ఫ్లైయింగ్ స్క్వాడ్, హైపవర్ కమిటీలు పలు కేంద్రాలను తనిఖీ చేశాయి.
 
 ఆర్‌ఐఓ పరంధామయ్య మాస్టర్‌మైండ్స్, శ్రీచైతన్య, శ్రీగాయత్రి, శ్రీమేథ, ఆర్‌ఎస్‌ఆర్ మున్సిపల్ పాఠశాల తదితర కేంద్రాలను తనిఖీ చేశా రు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు ఈ దఫా ప్రకటించడం, అర్ధగంట ముందుగా రావాలనే కొత్త నిబంధనలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనేక కేం ద్రాల వద్దకు ఉదయం 7 గంటలకే చేరుకున్నారు. అయితే నెల్లూరు నగరంలోని అరవిందనగర్‌లో ఉన్న వివేకానంద కళాశాల వద్ద తగిన బోర్డు ఉంచకపోవడంతో కొందరు విద్యార్థులు ఆదరాబాదరగా అదే బ్రాంచి ఉన్న స్టోన్‌హౌస్‌పేటకు వెళ్లారు. ఆ సెంటర్‌ను తమకు కేటాయించలేదని తెలుసుకుని వారు మళ్లీ ఏడుస్తూ అరవిందనగర్‌లోని కళాశాలకు వచ్చారు. ఈ లోపు కళాశాల వారు బోర్డు ఏర్పాటు చేశారు. చివరి నిమిషంలో పరీక్ష కేంద్రానికి చేరుకున్నామని, లేదంటే తమ భవిష్యత్ నాశనమయ్యేదని విద్యార్థులు పేర్కొన్నారు.
 
 అరగంట ముందుగా అంటే  8.30కు చేరుకోలేదనే నెపంతో ఆలస్యానికి కారణాలంటూ విద్యార్థులతో వివరణ పత్రాలు రాయించుకున్నారు. దీంతో కొన్ని చోట్ల వారు కంగారు పడ్డారు. ఈ పత్రాలు తీసుకుని ఏమి చేస్తారో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఒకటి రెండు సంఘటనలు మినహా మొత్తం మీద పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

మరిన్ని వార్తలు