రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

3 Feb, 2016 03:43 IST|Sakshi
రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టుగా పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో కాకుండా, సాధారణ విధానంలోనే జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇంటర్‌బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
 154 పరీక్షా కేంద్రాలు.. జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు 64 కేంద్రాలు ఏర్పాటు చేశారు. చివరి నిమిషంలో సాధారణ పద్ధతిలోనే ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో పరీక్షా కేంద్రాల సంఖ్య 154కు చేరింది. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు.
 ప్రాక్టికల్స్‌కు 26,309 మంది విద్యార్థులు..జిల్లాలో 316 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలున్నాయి.


వీటిలో 26,309 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాయనున్నారు. నాలుగు స్పెల్‌లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మొదటి స్పెల్‌లో భాగంగా 46 పరీక్షా కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో స్పెల్‌లో ఐదు రోజుల వంతున ఈ నెల నాలుగో తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.  ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్‌బోర్డు సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్స్ పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీ నిర్వహిస్తారు.


 ‘గంటా’పథంగా చెప్పినా.. వెనుకడుగు.. ఐదేళ్లుగా జంబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్స్ నిర్వహిస్తామంటూ విద్యాశాఖ మంత్రులు ప్రకటించి, చివరి నిమిషంలో వెనకడుగు వేస్తున్నారు. ఈ ఏడాది కూడా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అదే బాట పట్టారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ ‘జంబ్లింగ్’ తంతును ‘సాక్షి’ గతేడాది డిసెంబర్ రెండో తేదీన ‘ప్రయోగం ఫలిస్తుందా?’ అని, ఈ ఏడాది జనవరి 12న ‘జంబ్లింగ్ ఉన్నట్టా.. లేనట్టా? శీర్షికలతో కథనాలు ప్రచురించింది కూడా.


 అధికారుల సమయం, శ్రమ వృథా : జంబ్లింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసి ఆయా కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.  పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలనే విషయమై చేపట్టిన సమీక్షా కార్యక్రమాలతో ఇంటర్‌బోర్డు అధికారుల సమయం వృథా అయ్యింది
 
 

మరిన్ని వార్తలు