ఇంటర్ ప్రవేశాల్లో సిక్కోలు రికార్డు!

27 Jul, 2015 00:08 IST|Sakshi

 శ్రీకాకుళం న్యూకాలనీ: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావొస్తోంది. జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. 2015-16 విద్యా సంవత్సరానికి ఇప్పటివరకు ప్రథమ సంవత్సరంలో 11,200 మందికి ప్రవేశాలు కల్పించి రాష్ట్రంలోనే సర్కారీ కళాశాలల్లో అత్యధికంగా అడ్మిషన్లు నమోదు చేసిన జిల్లాగా శ్రీకాకుళం రికార్డులకెక్కింది. ఇందులో జనరల్ 9800 మందికాగా ఒకేషనల్ మరో 1400 మంది ఉండటం గమనార్హం. ఇంత భారీగా అడ్మిషన్ల నమోదుకు ఆ శాఖ అధికారులు తీసుకున్న ప్రత్యేక చొరవేనని ఇంటర్ విద్య డీవీఈవో పాత్రుని పాపారావు వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కోట్లాది రూపాయలతో నిర్వహిస్తున్న పనులు, పాఠ్య పుస్తకాల పంపిణీ, అధ్యాపకుల కొరత, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, తదితర అంశాలపై తన కార్యాలయం లో ఆదివారం ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు.
 
 పాఠ్య పుస్తకాల పంపిణీ
 జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు 1.13వేల పాఠ్య పుస్తకాలను తెప్పించాం. దాదాపు 80 శాతం మేర పంపిణీ చేశాం. మరికొన్ని పంపిణీ కావాల్సి ఉంది.
 
 ఐఆర్‌డీఎఫ్ పథకం కింద నిధులతో..
 రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్(ఐఆర్‌డీఎఫ్) పథకంలో భాగంగా నాబార్డ్‌స్కీమ్-18లో ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ఎల్.ఎన్.పేట జూనియర్ కళాశాలకు రూ.1.15లక్షలు, కొయ్యాం జూనియర్ కళాశాలకు రూ.1.15 లక్షల సాధారణ నిధులతో ఇప్పటికే పూర్తిస్థాయిలో భవనాలను నిర్మించాం.
 
 నాబార్డ్-19 స్కీమ్ కింద ఆమదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, టెక్కలి, పలాస, పొందూరు, వంగర, మెళియాపుట్టి (ఎనిమిది) కళాశాలల్లో రూ.65 లక్షల చొప్పున అవసరమైన తరగతి గదులు, భవన నిర్మాణ పనులు చేపడుతున్నాం. ఆమదాలవలస పను లు పూర్తయ్యాయి. పలాసలో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అన్ని కళాశాలల్లో విద్యాశాఖకు చెందిన ఏపీఈ డబ్ల్యూఐడీసీ ఏజెన్సీ ద్వారా పనులు జరుగుతున్నాయి.
 
 నాబార్డ్-20 స్కీమ్ కింద రూ.2.30 లక్షలతో పాలకొండ బాలుర జూనియర్ కళాశాలలో పనులు ప్రారంభంకావాల్సి ఉంది. కొత్తూరు కళాశాలకు ఐటీడీఏ ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.1.25 లక్షల పనులకు టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఇచ్ఛాపురం కళాశాల అక్కడి ప్రభుత్వ హైస్కూల్‌లో పనిచేస్తోంది. సొంత భవనాల కోసం స్థల సేకరణ జరుగుతోంది. ప్రతిపాదనలు పంపించాం.
 
 మౌలిక సదుపాయాలపై..
 అన్ని కళాశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతున్నాం. మరుగుదొడ్లు లేని కళాశాలల జాబితాను ఇంటరు బోర్డుకు పంపించాం. త్వరలో మరిన్ని నిధులు విడుదలకానున్నాయి. నాబార్డ్-19 స్కీమ్ కింద మంజూరైన 8 కళాశాలలకు ఒక్కో కళాశాలకు రూ.4 లక్షల విలువైన ఫర్నిచర్, పరికరాలు వచ్చాయి. పంపిణీకి ఏర్పాట్లు చేశాం.
 
 అధ్యాపకుల  కొరతపై...
 జిల్లాలో 49 జనరల్, 14 ఒకేషనల్ కోర్సుల సబ్జెక్టుల్లో అధ్యాపకుల కొరత ఉన్నమాట వాస్తవమే. గత ఏడాది విశ్రాంత అధ్యాపకులతో క్లాసులు చెప్పించాం. ప్రభుత్వం ఈ ఏడాదికి ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. వివిధ సబ్జెక్టుల్లో జిల్లా సగటు ఉత్తీర్ణత శాతంతో సరిపోల్చి కాంట్రాక్ట్ లెక్చరర్ల రెన్యువల్స్‌ను కొనసాగిస్తాం. సర్కారీ కళాశాలల్లో ఇంటర్ విద్య బలోపేతానికి, మెరుగైన ఫలితాల సాధనకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు సమిష్టిగా కృషిచేయాలి.
 

మరిన్ని వార్తలు