నీటిలో ప్రాణం.. గాలిలో దీపం!

16 Nov, 2019 11:59 IST|Sakshi
రామతీర్థానికి దిగువున ఉన్న ప్రమాదకర డ్రాప్‌

నీటిలో తేలుతున్న ప్రాణాలు

రామతీర్థం నుంచి టెయిల్‌ ఎండ్‌ వరకు ఓబీసీపై ఏడెనిమిది డేంజర్‌ స్పాట్‌లు

లాకులు, డ్రాప్‌ల వద్దే జరుగుతున్న ప్రమాదాలు

ఏటా సరాసరిన 10 మందికిపైగా మృత్యువాత

చీమకుర్తి: నాలుగు రోజుల క్రితం కేవీపాలెం వంతెన లాకులకు సమీపంలో ఉన్న డ్రాప్‌ల వద్ద సాగర్‌ కాలువలో ఈత కోసం దిగిన ఇద్దరు ఇంటర్‌ విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు. త్రోవగుంట మేజర్‌ వద్ద గతంలో ఒంగోలుకు చెందిన ఇద్దరు స్నానానికి దిగి ప్రాణాలను నీటిలోనే వదిలేశారు. సంతనూతలపాడు మండలం చండ్రపాలెం లాకుల వద్ద దుస్తులు ఉతుకుతూ ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి సంఘటనల్లో ఏటా ఒంగోలు బ్రాంచ్‌ కెనాల్‌ (ఓబీసీ)లో సరాసరిన 10 మందికిపైగా మృత్యువాత పడుతుంటారని స్థానికుల అంచనా. రామతీర్థం రిజర్వాయర్‌ నుంచి టెయిల్‌ ఎండ్‌ ప్రాంతం వరకు దాదాపు 5–6 లాకులు ఉన్నాయి. 10కి పైగా డ్రాప్‌లు ఉన్నాయి. లాకుల వద్ద కంటే డ్రాప్‌ల వద్దే నీటి ప్రవాహ వేగం ఎక్కువుగా ఉంటుంది. డ్రాప్‌నకు దిగువన నీటి సుడులు సుడులుగా తిరుగుతూ ప్రమాదకరంగా ఉంటోంది.

ఈత కోసం వచ్చే వారే ఎక్కువ
రబీ సీజన్‌లో రైతులు పంటలు సాగు చేసుకునే వారికి ఇరిగేషన్‌ అధికారులు సాధారణంగా జూలై నుంచి మరుసటి సంవత్సరం ఫిబ్రవరి లేక మార్చి వరకు సాగర్‌ నీరు విడుదల చేస్తుంటారు. చీమకుర్తికి సమీపంలో ఓబీసీ కాలువ అందుబాటులో ఉండటంతో కూనంనేనివారిపాలెం వెళ్లే దారిలో వంతెన వద్ద ఎక్కువ మంది విద్యార్థులు, ఇతర పెద్దలు స్నానాలకు దిగుతుంటారు. వారిలో సగం మందికిపైగా ఈత నేర్చుకుందామనుకుని వచ్చేవారే. ఈత బాగా వచ్చిన వారు కూడా కాలువలో నీటి ప్రవాహం ఎక్కువైతే కొట్టుకుపోయి డ్రాప్‌లో పడ్డారంటే సుడి తిప్పినట్లు తిప్పేసి చివరకు శవాన్ని మరుసటి రోజుకు కిలోమీటరు దూరంలో కనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఏటా రామతీర్థం, ఎన్‌ఎస్‌పీ కాలనీ, గురుకుల పాఠశాల వెనుక, మువ్వవారిపాలెం డొంక సమీపం, కేవీ పాలెం వద్ద, చండ్రపాలెం, త్రోవగుంట మేజర్‌ వంటి పలు డేంజర్‌స్పాట్‌ల వద్దే ఎక్కువ మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఓబీసీ కట్టపైనే చీమకుర్తి బైపాస్‌ కూడా ఉండటంతో మనుషులే కాకుండా భారీ వాహనాలు, బైకులు, కార్లు, ట్రాక్టర్‌లు కూడా కాలువలోకి దూసుకొచ్చి చావుతుప్పి కన్నులొట్టబోయిన సంఘటనలు బోలెడు ఉన్నాయి. 

అధికారుల నిర్లక్ష్యం
సాగర్‌ నీరు ఓబీసీలో దాదాపు నాలుగైదు నెలల పాటు ప్రవహిస్తుంటాయి. ఏటా కాలువలోని డ్రాప్‌ల వద్ద పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ ప్రమాదాల గురించి జిల్లాస్థాయి, మండల స్థాయి ఇరిగేషన్‌ అధికారులు కొన్నేళ్లుగా వింటూనే ఉన్నారు. జాగ్రత్తలు మాత్రం ఇంతవరకు తీసుకోకపోవడం గమనార్హం. డేంజర్‌ స్పాట్‌ల వద్ద ఈతకు దిగితే కలిగే ప్రమాదం గురించి తెలియజేసే హెచ్చరిక బోర్డులు ఎక్కడా కనిపించవు. డ్రాప్‌ల వద్ద నీటి వేగం నుంచి ఈతకు దిగిన వారు బయట పడేందుకు ఆసరాగా ఉండే సిమెంట్‌ పిల్లర్లు, భీమ్‌లు లేక ఇతర ఆధారాలను కల్పించే ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం శోచనీయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అమాయక ప్రజల ప్రాణాలు నీటిలో కలిసి పోకుండా ఉండాలంటే ఈతకు దిగే డేంజర్‌ స్పాట్‌లను ముందుగా గుర్తించాలని, వాటి వద్ద సరైన హెచ్చరికలు తెలియజేసే సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

తగిన చర్యలు తీసుకుంటాం
ఓబీసీలో రామతీర్థం నుంచి టెయిల్‌ ఎండ్‌ వరకు 10 వరకు డ్రాప్‌లు ఉన్నాయి. వాటి వద్ద నీటి సుడులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈత వచ్చిన వారికి కూడా డ్రాప్‌ల వద్ద బయట పడాలంటే కష్టంగా ఉంటుంది. ఇలాంటి డేంజర్‌ స్పాట్‌ల వద్ద ప్రమాదాలు జరగకుండా సైన్‌బోర్డులు లేక ఇతర ఏర్పాట్ల గురించి జిల్లా ఇరిగేషన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటా.శ్రీనివాసరావు, ఈఈ, ఇరిగేషన్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా