చదువుకోవడం ఇష్టం లేక

13 Nov, 2017 07:33 IST|Sakshi

రైలు కింద పడి ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య 

కోట్ల  రైల్వే స్టేషన్‌ సమీపంలో ఘటన 

కర్నూలు: చదువుకోవడం ఇష్టం లేక ఇంటర్మీడియేట్‌ విద్యార్థి బాలాజీ హేమంత్‌(16) రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈయన తండ్రి భాస్కర్‌.. పుల్లారెడ్డి కళాశాలలో కంప్యూటర్‌ ఆçపరేటర్‌గా పని చేస్తున్నాడు. నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని కేంద్రీయ విద్యాలయానికి ఎదురుగా  ధనలక్ష్మి నగర్‌లో నివాసం ఉంటున్నారు. బాలాజీ హేమంత్‌ గాయత్రి ఎస్టేట్‌లోని గాయత్రి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్నాడు. చదువుపై ఆసక్తి లేక కొంత కాలంగా మానుకుంటానని తల్లిదండ్రులతో మొర పెట్టుకున్నాడు.

 ఎలాగైనా  చదువుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని తల్లిదండ్రులు నచ్చజెప్పి కళాశాలకు పంపించడంతో ఒత్తిడి తట్టుకోలేక ఆదివారం ఉదయం కోట్ల రైల్వే స్టేషన్‌–  కృష్ణా నగర్‌ రైల్వే గేట్‌ మధ్యలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే రైల్వే ఎస్సై ఆనందరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతుడి జేబులో ఉన్న చిరునామ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు.

 భాస్కర్‌కు ఇద్దరు కుమారులు, రెండవ కుమారుడు మూడవ తరగతి చదువుతున్నాడు. వీరిది స్వగ్రామం నందికొట్కూరు ఉద్యోగ రీత్యా కొన్నేళ్లుగా కర్నూలులోనే నివాసం ఉంటున్నారు. చదువుపై ఆసక్తి లేకనే తన కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని భాస్కర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ  తెలిపారు. 

మరిన్ని వార్తలు