నా చావుకు ఈడే కారణం..

23 Apr, 2015 13:47 IST|Sakshi
నా చావుకు ఈడే కారణం..

విజయవాడ : విజయవాడలో దారుణం జరిగింది. ఆకతాయి వేధింపులకు ఇంటర్మీడియట్ విద్యార్ధిని తేజశ్రీ మానస బలైంది.  పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం యనమలకుదురు శివపార్వతీనగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి మర్రిబోయిన మధుసూదనరావు,వెంకట శైలజలకు తేజశ్రీ మానస(16)కుమార్తె ఉంది. ఆమె ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. వీరి ఇంటి సమీపంలో ఈడే శ్రీనివాసరావు కుటుంబం ఉంది. కాగా శ్రీనివాసరావు కుమారుడు రేణుకారావు(19)(నాని) తేజశ్రీ మానసతో చనువుగా ఉండేవాడు. అయితే అతను ప్రేమించమని వేధించడంతో ఆమె కొంతకాలంగా దూరంగా ఉంది. అయినా ఫోన్ చేయడం, మెసేజ్‌లు పెట్టడంతో విషయాన్ని బాలిక తల్లి వెంకట శైలజ దృష్టికి తీసుకువచ్చింది. దీంతో బాలిక వద్ద ఉన్న ఫోన్ తల్లికి ఇచ్చేయగా ఆమెకు కూడా ఫోన్ చేసి మానసను ప్రేమిస్తున్నానంటూ ఫోన్లు చేశాడు.

గుడికి వెళ్లి వచ్చేలోపు బలవన్మరణం
 తేజశ్రీమానస తల్లి శైలజ పుట్టినరోజు బుధవారం కావడంతో దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళతామని కుమార్తె తేజశ్రీమానసను రమ్మని తల్లి కోరింది. ఇంటర్ మొదటి ఏడాది ఫలితాలు వచ్చిన తరువాత గుడికి వస్తానని చెప్పడంతో తల్లి  ఉదయం 11.30 గంటల ప్రాంతంలో గుడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి  ఇంటి తలుపులు లోపల గడియపెట్టి ఉంది. ఎంతసేపటికీ తీయకపోవడంతో తలుపు తీసి లోనికి వెళ్లి చూడగా వంటగ గదిలో తేజశ్రీమానస చున్నీతో ఫ్యాన్ కొక్కానికి ఉరేసుకుని ఉంది. ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. తన కుమార్తెను ప్రేమించమని వేధించడం వలనే మృతి చెందిందని మృతురాలి తల్లి శైలజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మృతురాలు సూసైడ్‌నోట్‌లో కూడా  తన మరణానికి (నా చావుకు ఈడే కారణం) రేణుకారావు కారణమని రాసింది. పోలీసులు సూసైడ్‌నోట్ స్వాధీనం చేసకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు