వేళకు రారు.. వేచి చూడరు!

31 Dec, 2013 00:10 IST|Sakshi

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమయపాలన గాడితప్పుతోంది. మెజారిటీ పాఠశాలల్లో బడిగంట మోగినప్పటికీ ఉపాధ్యాయుల జాడ మచ్చుకు కూడా కనిపించడం లేదు. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా జిల్లా రాజీవ్ విద్యామిషన్ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15వరకు 921 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. ఉన్నత పాఠశాలలతో పోలిస్తే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని తేలింది.
 
 సమయపాలనే అసలు సమస్య..
 సర్కారు బడుల్లో ప్రధానంగా సమయపాలనే పెద్ద సమస్యగా మారింది. విద్యాశాఖ కఠినంగా వ్యవహరించక పోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందనే వాదన వినిపిస్తోంది. గతనెల బాలల దినోత్సవం నాడు ఆర్‌వీఎం పీఓ ఉప్పల్ మండలంలోని ఓ పాఠశాలను తనిఖీ చేశారు. ఆ పాఠశాలలో తొమ్మిది మంది టీచర్లుండగా బడివేళకు ఒక్క టీచరు కూడా హాజరుకాలేదు. దీంతో తనిఖీ రిపోర్టును జిల్లా విద్యాశాఖకు సమర్పించినప్పటికీ ఇప్పటికీ చర్యలు తీసుకున్న దాఖల్లాలేవు. మరోవైపు ఉప విద్యాధికారులు సైతం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం లేదు. కేవలం రెండు నెలల కాలంలో రెండు పాఠశాలలు మాత్రమే తనిఖీ చేయడం గమనార్హం.
 
 తనిఖీల్లో వెలుగుచూసిన వాస్తవాలివీ
     జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెప్టెంబర్ నెలాఖర్లో నిర్వహణ నిధులు విడుదల చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు నిబంధల మేరకు రూ.1.5కోట్లు విడుదల చేశారు. అయితే తనిఖీ చేసిన 921 పాఠశాలల్లో నిర్వహణ నిధులు వినియోగించినప్పటికీ.. మెజారీటీ వాటిలో టాయిలెట్లు కంపు కొడుతున్నాయి.
 

  •  బోధకులు లేని కారణంతో 95 శాతం పాఠశాలల్లో కంప్యూటర్లు మూలన పడ్డాయి. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో అడపాదడపా కంప్యూటర్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
  •  చాలా చోట్ల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఫర్నిచర్ కొరత ఉంది.
  •  ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు బోధన ప్రణాళిక ప్రకారం సాగుతోంది. అయితే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మాత్రం విద్యార్థులకు సరైన రీతిలో బోధన జరగడం లేదు.
  •  {పోగ్రెస్ కార్డుల పంపిణీ సగం పాఠశాలల్లో పెండింగ్‌లో ఉంది.
     

మరిన్ని వార్తలు