రాజధానిలో ‘ఇంటర్‌ సెప్టర్‌’ నిఘా

10 Aug, 2018 13:41 IST|Sakshi
ఇంటర్‌ సెప్టర్‌ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న డీజీపీ ఆర్పీ ఠాకూర్, కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు

నగర పోలీసులకు 12 ఇంటర్‌ సెప్టర్‌ వాహనాలు

ఖాకీలకు అందుబాటులోకి వచ్చిన తక్షణ స్పందన వ్యవస్థ

ప్రజా సమస్యలు తెలిపేందుకు వాట్సాప్‌ (7328909090)     సౌకర్యం

సాక్షి, అమరావతి బ్యూరో : నగర పోలీసుల అంబుల పొదిలో ఓ కొత్త అస్త్రం వచ్చి చేరింది. శాంతి భద్రతల పరిరక్షణ, నిఘా వ్యవస్థ పటిష్టత దిశగా విజయవాడ పోలీసు కమిషరేట్‌ మరో ముందడుగు వేసింది. సత్వర, తక్షణ స్పందన కోసం ఇంటర్‌ సెప్టర్‌ వాహనాలు విజయవాడ పోలీసులకు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం 12 ఇంటర్‌ సెప్టర్‌ వాహనాలను విజయవాడ పోలీస్‌ కమిషరేట్‌కు సమకూర్చింది. డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ ఈ వాహనాలను గురువారం ప్రారంభించారు. వాటితోపాటు ప్రజలు తమ సమస్యలను తెలిపేందుకు మెసేజ్‌లు, ఫొటోలు, వీడియో రూపంలో పంపేందుకు ఏర్పాటు చేసిన వాట్సాప్‌ సదుపాయాన్ని కూడా ప్రారంభించారు. ఆ వాట్సాప్‌ నంబర్‌ 7328909090.

నగరంలో 24 గంటలూ నిఘా..
12 ఇంటర్‌ సెప్టర్‌ వాహనాలతో విజయవాడ పోలీసులకు ఆధునిక భద్రతా వ్యవస్థ అందుబా టులోకి వచ్చినట్లైంది. వాటిలో 4 స్కార్పియో, 8 బొలేరో వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల్లో వీహెచ్‌ఎఫ్‌ సెట్, ఎంపీడీ డివైజ్, డిజిటల్‌ కెమెరా, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్, జీపీఎస్‌ డివైజ్, బ్రీత్‌ అనలైజర్లు, బాడీ ప్రొటెక్టర్, అగ్నిమాపక పరికరాలు, వాటర్‌ క్యానన్, కార్టన్‌టేప్‌ బండిల్, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ మొదలైనవి ఉండటం విశేషం. విజయవాడలోని ముఖ్యమైన కూడళ్లలో 24 గంటలూ ఈ వా హనాలను అందుబాటులో ఉంచుతారు. నగరంలో ఎక్కడ ఏమైనా జరిగినా, అత్యవసర పరిస్థితి తలెత్తినా పోలీసులు తక్షణం స్పందిస్తారు.

ప్రజా భద్రతకే అధిక ప్రాధాన్యం..
రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ ఠాకూర్‌ చె ప్పారు. ఇంటర్‌ సెప్టర్‌ వాహనాలను ప్రారంభిం చిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయవాడలో 24 గంటలూ నిఘాను కట్టుదిట్టం చేస్తామన్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌. ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ శాంతిభద్రతల పరి రక్షణకు పోలీసు యంత్రాంగం పూర్తి సమన్వయంతో పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం, ఇంటెలిజెన్స్‌ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శాంతిభద్రతల ఏడీజీ హరీష్‌కుమార్, సీఐడీ ఏడీజీ అమిత్‌ గార్గ్, నగర జాయింట్‌ సీపీ కాంతిరాణా, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు