ఆసక్తి రేపుతున్న రైస్ మిల్లర్ల ఎన్నికలు

29 Sep, 2013 04:21 IST|Sakshi
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మిల్లర్లు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ ఎన్నిక ఈసారి కూడా ఏకగ్రీవమవుతుందా? ఎన్నిక అనివార్యమవుతుందా?? అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం తేల్చేందుకు ఆదివారం సంఘం సర్వసభ్య సమావేశం స్థానిక రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాల్‌లో జరగనుంది. ప్రతి ఏటా సంఘ సమావేశం జరగడం పరిపాటే అయినప్పటికీ త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండేళ్లకోసారి  సంఘ ఎన్నికలు జరుగుతాయి. ఈ సంఘం ఏర్పడిన తర్వాత గత 26 ఏళ్లలో మూడుసార్లు మాత్రమే ఎన్నిక అనివార్యమైంది. మిగిలిన అన్నిసార్లు ఏకగ్రీవ ఎన్నికే జరి గింది. ఈసారి మాత్రం ఎన్నికలు తప్పేట్లు లేదు. వరుసగా మూడోసారి అధ్యక్షునిగా వ్యహరిస్తున్న తంగుడు జోగారావు మరోసారి ఆ పదవిని తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. 
 
ఆయన సోదరుడు తంగుడు గిరిధరుడు కూడా ఈసారి పోటీ పడుతున్నారు. అధ్యక్షునిగా ఎన్నికవ్వాలంటే ముందు సం ఘంలో ఓటరుగా నమోదు కావాలి. ప్రస్తుతం జోగారావు ఓటరుగా ఉండగా, ఆయన స్థానంలో గిరిధరుడు ఓటరుగా నమోదు కావాల్సి ఉంటుంది. మిల్లు భాగస్వాములందరూ సమావేశమై  ఓటు హక్కు కల్పిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానిస్తేనే అది సాధ్యమవుతుంది. అయితే జోగారావు కూడా మరోసారి అధ్యక్ష పదవిని ఆశిస్తున్నందున ఓటరుగా వైదొలగి గిరిధరుడికి అవకాశం కల్పించే పరిస్థితి లేదు. జోగారావు మాజీ  మంత్రి ధర్మాన ప్రసాదరావు అనుచరుడు కాగా, ఆయన సోదరుడు గిరిధరుడు వైఎస్సార్ సీపీ నాయకుడు, నరసన్నపేట శాసనసభ్యుడు ధర్మాన కృస్ణదాస్ అనుచరుడు కావడంతో రాజకీయంగానూ ఈ ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిద్దరితోపాటు శ్రీకాకుళం రూరల్ మండలం వప్పంగి గ్రామానికి చెందిన వాసు కూడా రేసులో ఉన్నారు. గత పదిహేనుళ్లుగా సంఘం ట్రెజరర్‌గా పనిచేస్తున్న ఆయనకు మిల్లర్లలో మంచి పేరుంది. ఇతర జిల్లా నుంచి వలస వచ్చినప్పటికీ ఇక్కడే స్థిరపడి మిల్లరుగా మంచిపేరు తెచ్చుకున్నారు. ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో పోటీ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. 
 
రాజీ యత్నాలు ఫలించేనా?
కాగా మిల్లర్ల ఎన్నికలకు ముందు ప్రతిసారీ నరసన్నపేట శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాస్, దివంగత ఎర్రన్నాయుడు సోదరుడు హరివరప్రసాద్‌లు మిల్లర్లతో చర్చలు జరిపి ఎన్నికను ఏకగ్రీవం చేస్తున్నారు. అందువల్లే వీరిద్దరిని సంఘం గౌరవాధ్యక్షులుగా నియమిస్తున్నారు. ఆదివారం జరగనున్న సమావేశానికి కూడా వీరిద్దరూ హాజరుకానున్నారు. అయితే ఈసారి ఏకాభిప్రాయం కుదిరే పరిస్థితి కనిపించడంలేదు. వాసు, గిరిధరుడు, జోగారావులు ముగ్గురు పట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు పాలకొండ, టెక్కలి డివిజన్లకు చెందిన మిల్లర్లు కూడా ఈసారి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటివరకు శ్రీకాకుళం డివిజన్‌కు చెందినవారే అధ్యక్షులుగా వ్యవ హరించారని, దీనివల్ల తమకు గుర్తింపు లేకుండా పోతోందన్నది వారి ఆవేదన.  ఈసారి ఎన్నిక ఏకగ్రీవం కాని పక్షంలో తమలో ఒకరిని పోటీకి పెట్టాలని యోచిస్తున్నారు. ఆ రెండు డివిజన్ల మిల్లర్లు కొద్ది రోజుల క్రితం సమావేశమై పరస్పర సహకారానికి తీర్మానించుకున్నట్లు సమాచారం. 
 
ఇంత ప్రాముఖ్యత ఎందుకంటే..
మిల్లర్ల ఎన్నికకు ఇంతటి ప్రాముఖ్యత ఏర్పడటానికి సంఘానికి ఉన్న ఆస్తులు, ఆదాయం, నిధులే కారణమని అంటున్నారు. శ్రీకాకుళంలోని కల్యాణ మండపం అద్దెలతోపాటు ఇప్పటికే ఉన్న పది టన్నుల సామర్థ్యం కలిగిన గొడౌన్ల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోంది. అలాగే మిల్లర్లు సంఘం ద్వారానే లెవీ పర్మిట్ పొందాల్సి వస్తోంది. ఈ రూపంలో కూడా పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. సంఘం పేరిట పెద్ద మొత్తంలో నిధులు ఉండటం, లెవీ సేకరణ సమయంలో సంఘం అధ్యక్షుడికి కొంత ప్రాధాన్యతను ఇవ్వడం వంటి అంశాలు ఆ పదవిపై మోజు, డిమాండ్ పెంచాయి. పలువురు ఈ పదవిపై గురి పెట్టిన తరుణంలో ఆదివారం నాటి సమావేశం కూడా వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. 
 
 
మరిన్ని వార్తలు