శ్రీవారికీ బోర్డింగ్ పాస్!

15 Jul, 2015 03:16 IST|Sakshi
శ్రీవారికీ బోర్డింగ్ పాస్!

- విమానంలో ప్రయాణించిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి
- ప్రాణప్రతిష్ఠ చేసిన ఉత్సవమూర్తులను పెట్టెలో పెట్టేందుకు శాస్త్రం అడ్డురావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
- అమెరికాలో టీటీడీ కల్యాణోత్సవాల సందర్భంగా జరిగిన ఆసక్తికరమైన ఘటన

తిరుమల వెంకన్నకు అమెరికన్ విమాన సంస్థ బోర్డింగ్ పాసా?  ఆశ్చర్యం కలుగుతోంది కదూ..! అవును.. సాక్షాత్తు శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీవారు ఈనెల 11వ తేదీన అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నుంచి డల్లాస్‌కు ఆ దేశ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించారు. అదేమిటో తెలుసుకుందాం..
 
సాక్షి, తిరుమల:
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి సైతం బోర్డింగ్ పాస్ తీసుకుని విమానంలో ప్రయాణించారు. ఈనెల 1 నుంచి అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ, స్థానిక సంస్థలతో కలసి శ్రీనివాస కల్యాణోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందుకోసం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, సీవీఎస్‌వో నాగేంద్రకుమార్, అర్చకులు, అధికారులు తరలివెళ్లారు. ఇందుకోసం టీటీడీ ఆగమోక్తంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి విగ్రహాలను కూడా వెంట తరలించింది.

అక్కడ తొలుత వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా ప్రాణప్రతిష్ఠ, ఇతర వైదిక పూజలు నిర్వహించారు. తర్వాత  అవే విగ్రహాలతో శ్రీనివాస కల్యాణాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అప్పటి నుంచి విగ్రహాలను ఆగమబద్ధంగానే ఒకచోట నుంచి మరోచోటికి తరలిస్తూ కార్యక్రమాలను సజావుగా నిర్వహించారు. ఉత్సవాలు లేని రోజుల్లో కూడా మూడు పూట్లా నిత్య పూజలు ఆరాధనలు కొనసాగించారు. అయితే, ఈ నెల 10వ తేదీన వాషింగ్టన్ డీసీలో కల్యాణోత్సవం ముగించుకుని 11వ తేదీన డల్లాస్‌కు ఉత్సవమూర్తులు బయల్దేరారు. ప్రత్యేక వాహనంలో రోడ్డుమార్గంలో తరలించేందుకు సమయం సరిపోలేదు. దీంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో విగ్రహాలను తరలించాలని ఇటు టీటీడీ, అటు స్థానిక నిర్వాహకులు సంయుక్తంగా సంకల్పించారు.

ప్రాణప్రతిష్ఠతో పూజలు చేసిన విగ్రహమూర్తులను పెట్టెలో పెట్టి మూత వేయడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగమశాస్త్రం అంగీకరించదు. భారం ఆ వెంకన్నపైనే వేయడంతో సాక్షాత్తు ఆ స్వామే దారి చూపించినట్టైంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణికులకు కేటాయించే మూడు సీట్లలోనే విగ్ర హమూర్తులను తరలించేందుకు ఆగమేఘాలపై  ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు సీట్ల కోసం అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ద్వారా బోర్డింగ్ పాసులు తీసుకున్నారు. అనుకున్న విధంగానే ఉత్సవమూర్తులను విమానంలో తరలించి, డల్లాస్‌లో శ్రీవారి కల్యాణోత్సవాలను విజయవంతంగా ముగించారు. ఆసక్తికరమైన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ నిర్ణయించిన సమయాల్లోనే కల్యాణోత్సవాలను నిర్వహించడంలో టీటీడీ, స్థానిక నిర్వాహకులు నిమగ్నమయ్యారు.

మరిన్ని వార్తలు