నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ

12 Mar, 2014 00:19 IST|Sakshi

 సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 63,636 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం  తగిన ఏర్పాట్లు చేశారు. మారుమూల గ్రామాల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్న దృష్ట్యా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు  ఇంటర్మీడియెట్ రీజినల్ పర్యవేక్షణ అధికారి సీపీ గ్లాడిస్ తెలిపారు. మాస్ కాపీయింగ్ జరగకుండా గ్లోబల్ పొజిషన్ సిస్టమ్(జీపీఎస్) తో అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉదయం 9 గంటలకే పరీక్షలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8.45 గంటల లోపు చేరుకోవాలని సూచించారు.

 పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీప ప్రాంతాల్లోని జిరాక్సు సెంటర్లను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాలకు సెల్‌ఫోన్‌లు, ఇతర ఎల క్ట్రానిక్ పరికరాలను తీసుకు రావద్దని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు తక్షణ వైద్యం అందించేందుకు ఒక ఏఎన్‌ఎంను నియమిస్తున్నామన్నారు. అలాగే తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు గ్లాడిస్ తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 23,886 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 33,943, ఒకేషనల్ ప్రథమ సంవత్సరంలో 2,298 , ద్వితీయ సంవత్సరంలో 3,509 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలను జిల్లాస్థాయిలో డీఈసీ హెచ్‌పీసీల కమిటీలు పర్యవే క్షిస్తున్నాయి. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆర్‌ఐఓ తెలిపారు. 

మరిన్ని వార్తలు