ఇంటర్‌ వరకు అమ్మఒడి పథకం వర్తింపు

29 Jul, 2019 10:36 IST|Sakshi

సభలో తెలిపిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌

సాక్షి, అమరావతి: విద్యను వ్యాపారంలా చూడకుండా ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కోసం కమిషన్‌ను తీసుకొస్తున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో విద్యారంగంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సోమవారం అసెంబ్లీలో సమాధానమిచ్చారు. సేవా దృక్పథంతో విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. మోడల్‌ స్కూళ్ల పేరుతో మూసేసిన స్కూళ్లను మళ్లీ తెరిపించే దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 10 ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించామని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఒకే యాజమాన్యం పలు ప్రైవేటు విద్యాసంస్థలను నడుపుతోందని, పర్యవేక్షణ, నియంత్రణ లేకపోవడంతో ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పలు ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల కట్టడి జరుగుతోందని కథనాలు వస్తున్నాయన్నారు.
 
అమ్మఒడి పథకాన్ని పగడ్బందీగా అమలుచేస్తామని, అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్రంలో ఏడు లక్షలమందికిపైగా లబ్ధి చేకూరుతుందని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఇంటర్మీడియట్‌ వరకు అమ్మఒడి పథకాన్ని వర్తింపజేస్తామని వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పాటిస్తామని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలుచేస్తున్నారని, దీనిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలను సేవా దృక్పథంతో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సురేశ్‌ తెలిపారు.  

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ.. ప్రైవేటు విద్య వ్యాపారంలా మారిపోయిందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు సరైన ప్రమాణాలు పాటించడంలేదని, నాణ్యమైన విద్య అందివ్వడం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ ఎల్‌కేజీ చదువు కోసం రూ. 25వేల నుంచి లక్ష వరకు ప్రైవేటు స్కూళ్లు ఫీజులు వసూలు చేస్తున్నాయని సభకు తెలిపారు. అనుమతులు లేకపోయినా కొన్ని ప్రైవేటు స్కూళ్లు రెసిడెన్షియల్‌ క్యాంపస్‌లను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ.. చాలావరకు ప్రైవేటు స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని తెలిపారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నారాయణ సంస్థలకు ధారాదత్తం  చేసిందని మండిపడ్డారు. 
 

మరిన్ని వార్తలు