ఏపీలో అడ్డగోలుగా ఇంటర్ పరీక్షలు

11 Mar, 2016 01:01 IST|Sakshi
ఏపీలో అడ్డగోలుగా ఇంటర్ పరీక్షలు

అర్ధవీడు: ఏపీలోని ప్రకాశం జిల్లాలో మండల కేంద్రమైన అర్ధవీడు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పరీక్షలు మూడు స్లిప్పులు.. ఆరు సమాధానాలు అన్నట్లు సాగుతున్నాయి. పరీక్ష మొదలైన 20 నిమిషాలకే అధ్యాపకులు ప్రశ్నపత్రాన్ని బయటకు తెప్పించుకుని కార్బన్ పేపరు ఉపయోగించి స్లిప్పులు రాసి విద్యార్థులకు పంపుతున్నారు. ఈ విషయమై సమాచారం అందిన ‘సాక్షి’ విలేకరి గురువారం పరీక్ష కేంద్రానికి వెళ్లగా లెక్కలు-1బి ప్రశ్నపత్రానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్టాఫ్ రూంలో కాంట్రాక్టు అధ్యాపకులు డానియేలు, రాజు, జూనియర్ లెక్చరర్ వనిపాల్‌రెడ్డి కార్బన్ పేపర్లు పెట్టి జవాబులు రాస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే గదిలోనుంచి పరారయ్యారు. పరీక్షల చీఫ్ అయిన ప్రిన్సిపాల్ కుటుంబరావు, డిపార్ట్‌మెంటల్ అధికారి బి.శివలక్ష్మి కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతోందని, దీనికి ఆ ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు కూడా సహకరిస్తున్నారని ఆరోపణలున్నాయి.

మరెలా పాస్ అవుతారు: ప్రిన్సిపాల్
మాస్ కాపీయింగ్ జరుగుతున్న తీరుపై ప్రిన్సిపాల్ కుటుంబరావును ‘సాక్షి’ అడగగా మారుమూల ప్రాంతంలో కాపీలు జరగకపోతే ఎలా పాస్ అవుతారు అని ప్రశ్నించారు. వెంటనే నాలుక్కరచుకొని ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయని చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు