బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు

24 Oct, 2015 01:22 IST|Sakshi
బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు

సినీనటుడు కృష్ణంరాజు
 
ఇంద్రకీలాద్రి : బాహుబలితో తెలుగు సినీపరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, పరిశ్రమలో ఉన్న ప్రముఖులందరూ ఇదేస్థాయిలో సినిమాలు తీసేందుకు ముందుకు రావాలని ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.కృష్ణంరాజు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన దసరా ఉత్సవాల్లో ఆఖరి రోజు గురువారం  రాజరాజేశ్వరిదేవి అలంకారంలో అమ్మవారిని  కృష్ణంరాజు దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం దేవస్థానం ఈవో నర్సింగరావు కృష్ణంరాజుకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందచేశారు. అనంతరం కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ బాహుబలి సినిమా మన సినీ పరిశ్రమకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిందన్నారు.

శుక్రవారం హీరో ప్రభాస్ పుట్టిన రోజు అని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించినట్లు చెప్పారు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేసుకుంటున్నామని, మన పూర్వ చరిత్ర కంటే గొప్పగా అమరావతి నిర్మాణం జరగాలని అమ్మ వారి ఆశీస్సులు కోరుకున్నట్లు కృష్ణంరాజు తెలిపారు. ఎన్నోయేళ్ల తర్వాత  మనం అనుభవించిన కష్టాల నుంచి బయటపడ్డామని, ప్రజల ఇబ్బందులు, కష్టాలు తెలిసిన మనలో ఒకరు దేశ ప్రధానిగా వచ్చారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
 
 అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు..
 కృష్ణలంక: శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా గురువారం రాజరాజేశ్వరిదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్నవారిలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాస్, సీఐడీ చీఫ్ అధికారి ద్వారకాతిరుమల, రిటైర్డ్ ఐజీ సీఆర్ నాయుడు, సినీనటుడు సాయికుమార్ తదితరులు ఉన్నారు.  
 

>
మరిన్ని వార్తలు