డెంగీతో ఇంటర్ విద్యార్థిని మృతి

13 Jul, 2016 23:51 IST|Sakshi

 సంతబొమ్మాళి : భావనపాడుకు చెందిన బయ్యూ జానకి(17) అనే ఇంటర్మీడియెట్ విద్యార్థిని డెంగీ వ్యాధితో మంగళవారం రాత్రి మృతి చెందింది. జానకి నౌపడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ గ్రూపులో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంది. జానకికి ఆరు రోజుల కిందట జ్వరం రావడంతో పూండిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించినట్టు తల్లిదండ్రులు బయ్యూ సన్యాసిరావు, ఆదిలక్ష్మి తెలిపారు.
 
  నాలుగు రోజులైనా జ్వరం తగ్గకపోవడంతో అక్కడ నుంచి పలాసలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడి వైద్యుల సూచన మేరకు విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అక్కడ వైద్యం పొందుతూనే మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత జానకి మృతి చెందింది. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన గొరకల అప్పలనర్సమ్మ, ఎర్రన్న, బై.గురువులు, గొరకల అచ్చెమ్మ తదితరులు పలు వ్యాధులతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గ్రామస్తులు తెలిపారు.  
 
 మిత్రమా వెళ్లిపోయావా...
 తమతో కలిసి చదివిన జానకి ఇప్పుడు తమతో లేకపోవడంతో తోటి విద్యార్థులు, స్నేహితులు కన్నీరు పెట్టారు. చదువులో చురుకుదనంగా అందరితో కలివిడిగా స్నేహంతో మెలిగే జానకి తమను వదిలి వెళ్లిపోయిందంటూ తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యూరు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన విద్యార్థిని మృతి చెందడంతో మత్స్యకారులందరూ ఆ రోజుకు వేటకు వెళ్లకుండా తమ సంతాపాన్ని తెలియజేశారు. మృతిపై అధికారులు స్పందించి గ్రామంలో మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు