ప్రతిభే కొలమానం

31 Aug, 2019 06:57 IST|Sakshi

సచివాలయ పోస్టుల ప్రక్రియలో  అక్రమాలకు ఆస్కారమే లేదు

పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా ఏర్పాట్లు

అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దు

ఉద్యోగాలిప్పిస్తామనేవారి ఉచ్చులో చిక్కుకోవద్దు

ప్రశాంతంగా  పరీక్ష రాసి ప్రతిభ చూపించండి

‘సాక్షి’తో జిల్లా కలెక్టర్‌  వినయ్‌చంద్‌  

సాక్షి, విశాఖపట్నం:  పూర్తిగా మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి జరుగుతున్న పరీక్షలు ఇవి. అభ్యర్థి ప్రతిభ ఆధారంగానే ర్యాంకు నిర్ణయమవుతుంది. ఆ ర్యాంకు బట్టే ఉద్యోగం భర్తీ జరుగుతుంది. అంతేతప్ప ఇందులో ఎవరి జోక్యం ఉండదు. ఇది పూర్తిగా పోటీ పరీక్ష. ఏ అభ్యర్థి కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. కష్టపడి చదివి పరీక్ష బాగా రాస్తే కచ్చితంగా మేలు జరుగుతుంది. బయట అనవసర ప్రచారాలు నమ్మవద్దు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు.

పూర్తి పారదర్శకంగా పరీక్షలు..
ప్రతీ ప్రశ్నాపత్రం నాలుగు సెట్లుగా ఉంటుంది. ఎక్కడా కాపీయింగ్‌కు అవకాశం ఉండదు. ఇవి పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయి. ఇవి పోటీపరీక్షలు కాబట్టి అభ్యర్థులకు ప్రతి నిమిషం విలువైనదే. మాల్‌ప్రాక్టీస్‌ వంటి అనవసర ఆలోచనలు పెట్టుకోవద్దు. అది నేరమవుతుంది. తీవ్ర పరిణామాలు ఉంటాయి. అనవసరంగా భవిష్యత్తు పాడుచేసుకోవద్దు. చక్కగా చదువుకొని పరీక్షల్లో ప్రతిభ చూపించండి. అడిగిన ప్రశ్నకు జవాబు రాయండి. మైనస్‌ మార్కులు ఉన్నాయి గమనించండి.

కేంద్రానికి ముందుగానే చేరుకోండి.. 
ఇది పోటీ పరీక్ష కాబట్టి అభ్యర్థులంతా తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ఉదయం 7.30 నుంచి 8 గంటలకల్లా చేరుకుంటే మంచిది. పరీక్ష 10 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ 8 గంటల నుంచి పరీక్ష కేంద్రం గేటు తెరుస్తారు. అప్పటి నుంచే అభ్యర్థులు లోపలికి వెళ్లవచ్చు. ఏ హాల్‌లో ఏయే రోల్‌ నంబర్లు కేటాయించారో అక్కడ నోటీసు బోర్డులో వివరాలు ఉంటాయి. ముందుగానే చూసుకుంటే తనకు సంబంధించిన హాల్‌ ఎక్కడుందీ తెలుస్తుంది. 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ లోపలకు అనుమతించరు. అందుకే సకాలంలో పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి అభ్యర్థులంతా ప్రయత్నించాలి. అందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. అలాగే అర్బన్‌ ప్రాంతంలోని పరీక్ష కేంద్రాల జాబితాను ఆటోడ్రైవర్ల అసోసియేషన్లకు ఇచ్చాం. అభ్యర్థులకు సహకరించాలని ఆటోడ్రైవర్లను కోరాం. బస్సు లేదా ఆటో ఏదైనా ఏదైనా సరే పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరండి. కొంతమంది ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా జరిగే పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం పరీక్ష రాసిన కేంద్రాన్నే రెండో పూట పరీక్షకూ కేటాయించాం. కానీ ఉదయం పూట కన్నా మధ్యాహ్నం అభ్యర్థుల సంఖ్య తగ్గుతుంది కాబట్టి పరీక్ష హాల్, సీటింగ్‌ మారుతుంది. 12.30 గంటలకు పరీక్ష పూర్తయిన తర్వాత కాసేపు రిలాక్స్‌ అవ్వండి. 2 గంటలకల్లా తమకు కేటాయించిన హాల్‌ ఎక్కడుందో చూసుకొని వెళ్లండి.    
-ఇతర జిల్లాల నుంచి కూడా పరీక్ష రాయడానికి వస్తున్నారు కాబట్టి పరీక్ష తేదీకి ముందురోజే ఒకసారి పరీక్ష కేంద్రానికి వెళ్లి సరిచూసుకుంటే ఇంకా మంచిది.

ఓఎంఆర్‌ ఆధారిత పరీక్షలు.. 
ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకూ జరిగేవన్నీ వోఎంఆర్‌ ఆధారిత పరీక్షలే. ప్రశ్నాపత్రంతో పాటు వోఎంఆర్‌ షీట్‌ కూడా ఇస్తారు. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు చదివి జవాబులను వోఎంఆర్‌ షీట్‌లో నింపాలి. ఆప్షన్లు నాలుగింటిలో సరైనదాన్ని బాల్‌పాయింట్‌ పెన్‌ (బ్లాక్‌/బ్లూ)తో మాత్రమే నింపాలి. జెల్‌ పెన్, ఇంక్‌ పెన్, పెన్సిల్‌ ఎట్టి పరిస్థితిలోనూ వాడవద్దు. పరీక్ష ప్రారంభించడానికి ముందు అందరూ కచ్చితంగా ప్రశ్నాపత్రం బుక్‌లెట్, ఓఎంఆర్‌ షీట్‌పై ఉన్న సూచనలను తప్పకుండా క్షుణ్నంగా చదవాలి.

సాయంత్రానికల్లా ‘కీ’...
పరీక్ష పూర్తయిన తర్వాత ఒరిజినల్‌ ఓఎంఆర్‌ ఇన్విజిలేటర్‌కు అప్పగించి నకలు (రెండో కాపీ) అభ్యర్థులు తమ వెంట తీసుకెళ్లవచ్చు. ప్రశ్నాపత్రం తెచ్చుకోవచ్చు. ఏరోజు పరీక్షది ఆ రోజు సాయంత్రమే ప్రభుత్వం ‘కీ’ విడుదల చేస్తుం ది. అభ్యర్థులు దాన్ని గమనించి ఎన్ని మార్కులు వస్తాయో చూసుకోవచ్చు. పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయనడానికి ఇదే నిదర్శనం.

 మొబైల్, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు వద్దు.. 
అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి మొబైల్‌ ఫోను తేవద్దు. ఇతర ఎలక్ట్రానిక్స్‌ వస్తువులేవీ పరీక్ష హాల్‌లోకి అనుమతించరు. ఎవరైనా ఫోన్, మెటీరియల్, ఇతరత్రా పుస్తకాలు తెస్తే ఒక బ్యాగ్‌లో పెట్టి భద్రపరచుకోవడానికి పరీక్ష కేంద్రంలో ఒక గది ఉంటుంది. అయితే తమ వస్తువుల బాధ్యత అభ్యర్థులదే.

అందుబాటులో వైద్యం శిబిరం..
ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య శిబిరం (మెడికల్‌ క్యాంప్‌) పెడుతున్నాం. ఇద్దరు ఏఎన్‌ఎంలు, ప్ర థమ చికిత్స కిట్, మందులు ఉంటాయి. 108 అంబులెన్స్‌లను అలెర్ట్‌ చేసి ఉంచాం. పరీక్ష కేం ద్రంలో మంచినీరు ఏర్పాటు చేశాం. టాయిలె ట్స్‌ సౌకర్యం ఉంటుంది.  పరిశుభ్రంగా ఉంచేం దుకు పారిశుద్ధ్య కార్మికులను ఉంచుతున్నాం.

గట్టి పోలీసు భద్రత.. 
పరీక్షలన్నీ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన శిక్షణను సిబ్బంది, అధికారులందరికీ ముగ్గురు నోడల్‌ అధికారుల పర్యవేక్షణలో ఇప్పటికే పూర్తి అయ్యింది. శనివారం జిల్లాలో కేటా యించిన పోలీసుస్టేషన్లకు మెటీరియల్‌ చేరుతుంది. ఆదివారం ఉదయం పరీక్ష కేంద్రాలకు గట్టిపోలీసు భద్రతతో పంపిస్తాం. ఎక్కడా  ఇ బ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. 

తప్పుడు ప్రచారం నమ్మవద్దు.. 
పరీక్షా నిర్వాహకుల జాబితాలు బయటకు వచ్చాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఉద్యోగాలు అమ్ముడుపోతున్నాయనే కల్లబొల్లి మాటలు నమ్మవద్దు. ఈ పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇన్విజిలేటర్లకు కూడా తమను ఏ సెంటర్లకు కేటాయించిందీ ముందు రోజు మధ్యాహ్నం అదీ రహస్యంగా తెలియజేస్తారు. ఏ హాల్‌ కేటాయిస్తున్నదీ పరీక్ష రోజు ఉదయం 7.30 గంటలకు మాత్రమే సమాచారం ఇస్తారు. అందుకు సంబంధించిన జాబితాలన్నీ సీల్డ్‌ కవర్‌లో భద్రంగా ఉన్నాయి. బయటకు ఎలాంటి లీకేజీ జరగలేదు.

గుర్తింపు కార్డు ఉంటే మంచిది...
హాల్‌టికెట్‌లో కొంతమంది పేరు తప్పుగా వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. అయితే హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. ఆ హాల్‌టికెట్‌పై ఫొటో ఆధారంగానే పరీక్షాహాల్‌లోకి అనుమతి ఇస్తారు. ఎందుకైనా మంచిది అభ్యర్థులు తమ వెంట ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటర్‌ కార్డు వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపుకార్డులు ఏవైనా వెంట తెచ్చుకుంటే మంచిది. హాల్‌టికెట్‌లో ఏమైనా తప్పులు దొర్లితే సరిచూసుకోవడానికి మాత్రమే ఈ గుర్తింపు కార్డులు ఉపయోగపడతాయి. ఏదేమైనా హాల్‌టికెట్‌ మాత్రం వెంటతెచ్చుకోవడం మరచిపోవద్దు. అది లేకుంటే ఎట్టి పరిస్థితిలోనూ లోపలికి అనుమతించరు.

మరిన్ని వార్తలు