ఫైనల్ మ్యాచ్ చూస్తున్నంత సేపూ ఒకటే టెన్షన్

20 Nov, 2014 00:58 IST|Sakshi
ఫైనల్ మ్యాచ్ చూస్తున్నంత సేపూ ఒకటే టెన్షన్

ములపర్రు (ఆచంట) : ‘నవంబరు 16ను ఎప్పటికీ మరిచిపోలేం.. మా చిన్నోడు (కిడాంబి శ్రీకాంత్) ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన రోజు అది.. ఆ రోజు రాత్రి ఫైనల్ మ్యాచ్ చూస్తున్నంత సేపు ఒకటే టెన్షన్.. ప్రత్యర్థి సామాన్యుడు కాదు మరి.. చైనా దిగ్గజం లీన్‌డాన్.. అప్పటికే రెండు సార్లు మా చిన్నోడు అతని చేతిలో ఓడిపోయాడు..  మూడోసారి తలపడుతున్నాడు.. పోరు హోరాహోరీగా సాగుతోంది.. మా చిన్నోడి ఆట చూసి గెలుస్తాడనుకున్నాం.. దేవుడిపైనే భారం వేశాం.. చివరకు ఎవరూ ఊహించని విధంగా శ్రీకాంత్ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు’ అని కిడాంబి శ్రీకాంత్ తాతయ్య, అమ్మమ్మలు కొంమాండూరి స్వామినాథ న్, శేషవల్లి ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ తల్లి రాధా ముకుంద నాగమణి స్వగ్రామం పెనుగొండ మండలం ములపర్రు గ్రామం. బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ గురించి తెలుసుకునేందుకు ఆనందడోలికల్లో మునిగితేలుతున్న తాతయ్య, అమ్మమ్మలతో ఇంటర్వ్యూ.
 
  మీ మనవడు శ్రీకాంత్  విజయంపై మీ స్పందన
 చాలా సంతోషంగా ఉంది. ఆటల ద్వారా మా మనవడు పేరు ప్రపంచ దేశాల్లో మారుమోగుతుండటం చాలా హ్యాపీ. కష్టానికి తగిన ఫలితమిది.
 
  మీరెప్పుడైనా మీ మనవడు ఈ స్థాయికి వెళతాడని ఊహించారా
 వాడు చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌లో ప్రతిభ చూపేవాడు. ఎప్పటికైనా మంచిపేరు తెచ్చుకుంటాడనే నమ్మకం మాకుంది.  
 
  మీ పెద్దమనవడు కూడా  ఇదే రంగంలో ఉన్నారంట కదా
 అవును పెద్ద మనుమడు నందగోపాల్, చిన్న మనుమడు శ్రీకాంత్. ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్లే.  
 
  శ్రీకాంత్ బ్యాడ్మింటన్‌లో  రాణించడానికి ప్రోత్సాహకులు ఎవరు
 మా అల్లుడు (శ్రీకాంత్ తండ్రి)కి కూడా ఆటలంటే ఇష్టం. దేవుని దయవ ల్ల వారి ఆర్థిక పరిస్థితి బాగుండటంతో పిల్లలను ప్రోత్సహించారు. శ్రీకాంత్ ఈ స్థాయికి వెళ్లాడంటే ఆయనే కారణం.  
 
 శ్రీకాంత్ ఎక్కడ శిక్షణ తీసుకున్నాడు
 విశాఖ, ఖమ్మంలో కొద్దికాలం శిక్షణ పొందాడు. తర్వాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ అకాడమీలో ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నాడు.  
 
  భవిష్యత్‌లో శ్రీకాంత్ ఏం సాధించాలని మీరు కోరుకుంటున్నారు
 పుల్లెల గోపీచంద్ అంత ఎత్తుకు ఎదగాలని, ఒలింపిక్స్‌లో ఆడాలని కోరుకుంటున్నాం. అకాడమీ ఏర్పాటుచేసి తనలాంటి క్రీడాకారుల్ని తయారు చేయాలని ఆశిస్తున్నాం.  
 
  శ్రీకాంత్‌కు మీరిచ్చే  సలహా ఏమైనా ఉందా
 విజయాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోకూడదు. భవిష్యత్‌లో మరింత కష్టపడి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం.
 
 మీ చిన్నోడికి మీరిచ్చే కానుక ఏమైనా ఉందా
 చిన్నోడికే కాదు పెద్దోడికి కూడా ఇచ్చేందుకు రెండు ఇంక్ పెన్నులు కొని సిద్ధంగా ఉంచాం.
 

>
మరిన్ని వార్తలు