వలంటీర్ల ఇంటర్వ్యూలకు.. ఉన్నత విద్యావంతులు  

20 Jul, 2019 08:35 IST|Sakshi
చిత్తూరులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు 

అభ్యర్థుల్లో ఎక్కువ మంది పీజీ, బీఈడీ, టీటీసీ వారే

141 వలంటీర్‌ పోస్టులకు 574 మంది పోటీ

సాక్షి, చిత్తూరు రూరల్‌: గ్రామ వలంటీర్ల  నియామక ప్రక్రియలో కీలకమైన ఇంటర్వ్యూల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇందులో ఉన్నత విద్యావంతులు పెద్దసంఖ్యలో పాల్గొంటుండడం గమనార్హం. అధికారులు మండల కేంద్రంలో రోజుకు 40 నుంచి 50 మందిని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. భారీగా దరఖాస్తులు రావడంతో చిత్తూరులో రెండు వారాలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వేతనం తక్కువైనా.. భవిష్యత్తుకు భరోసా లభిస్తుందనే ఆశతో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాట్లు అభ్యర్థులు చెబుతున్నారు. ఇక సంక్షేమ పథకాలన్నింటనీ వలంటీర్ల ద్వారానే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌ బియ్యం, పింఛన్లు తదితర పథకాలను లబ్ధిదారులకు చేరవేసేందుకు ఈ వ్యవస్థను వినియోగించనున్నారు. చిత్తూరు మండలంలోని గ్రామాల పరి ధిలో 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ చొప్పున 141 మందికి నియమించే అవకాశం ఉంది. 574 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వాటిలో 500 దరఖాస్తులు ఆమోదం పొందాయి.

పెద్దసంఖ్యలో పట్టభద్రులు..
గ్రామ వలంటీర్‌ ఉద్యోగానికి ప్రభుత్వం ఇంటర్మీ డియట్‌ను అర్హతగా నిర్ణయించింది. దీంతో చిత్తూరు మండలంలోని వలంటీరు పోస్టులకు ఇంటర్‌ ఉత్తీర్ణతతో పాటు ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేసుకుని మౌఖిక పరీక్షకు హాజరవుతున్నారు. ఇందులో పీజీలు, డీగ్రీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు 320 మంది ఉన్నారు. కాగా ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారికి ప్రభుత్వం రూ. 5 వేల వేతనం అందించనుంది. 

పారదర్శకంగా.. 
పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు సైతం ఇంటర్వ్యూలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రజాసేవలో ఆసక్తి ఉన్న అభ్యర్థులకే గ్రామ సేవలో ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 

ఇష్టంతో దరఖాస్తు చేశాను..
నేను ఎంబీఏ చేశా. చదువు పూర్తి చేసి మూడేళ్లవుతోంది. కానీ ఉద్యోగం లేదు. ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను గుర్తించి వలంటీర్ల నియామకానికి అవకాశం కల్పించింది. ఈ పోస్టుకు కూడా పోటీ అధికంగా ఉంది. పీజీ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. నేను ఇష్టపడే దరఖాస్తు చేశాను. ఎంపికైతే ప్రజా సేవలో ఉంటా.       – వరలక్ష్మి, శెట్టిగారిపల్లె 

ఉపాధి కోసం..
నేను కూడా ఎంబీఏ పూర్తి చేశాను. ప్రస్తుత్తం గ్రామ వలంటీర్ల నియామకానికి దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకు వచ్చాను. రాష్ట్రంలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. కొత్త ప్రభుత్వం అందరికి ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించాలి. యువతకు బాసటగా నిలవాలి. ఆ దిశగా వైఎస్సార్‌ ప్రభుత్వం అడుగులు వేస్తుందనే నమ్మకం ఉంది.    – శివకుమార్, చెర్లోపల్లి 

పట్టభద్రులే అధికం..
వలంటీర్ల పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 9 రోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. ఇవి సజావుగా సాగుతున్నాయి. ఆదివారంతో కార్యక్రమం ముగుస్తుంది.  65 నుంచి 75 శాతం మంది పట్టభద్రులే దరఖాస్తు చేసుకున్నారు. వారంతా  పోటాపోటీగా ఎంతో ఉత్సాహంతో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.      – వెంకటరత్నం, ఎంపీడీఓ 

మరిన్ని వార్తలు