తగ్గని జ్వరం

23 Aug, 2015 01:22 IST|Sakshi
తగ్గని జ్వరం

 మచిలీపట్నం : జిల్లాలో విషజ్వరాలు అదుపులోకి రావటం లేదు. సోకింది విషజ్వరమో, డెంగీ జ్వరమో తేలక ప్రజలు సతమతమవుతున్నారు. చల్లపల్లి మండలం మాజేరులో విషజ్వరాలతో 18 మంది మరణించినా, ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోని పరిస్థితి నెలకొంది. తోట్లవల్లూరులో 700 మంది జ్వరంబారిన పడ్డారు. ఈ గ్రామంలో 20 రోజుల పాటు వైద్యశిబిరం నిర్వహించారు. తాజాగా నాగాయలంక మండలం గణపేశ్వరంలో వంద మందికి పైగా జ్వరంబారిన పడ్డారు. గ్రామానికి చెందిన నక్కల నిరీక్షణరావు అనే వృద్ధుడు జ్వరంతో శనివారం మృతి చెందాడని సమాచారం.

దీంతో గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. డీఎంఅండ్‌హెచ్‌వో ఆర్.నాగమల్లేశ్వరి, ఆర్డీవో పి.సాయిబాబు గ్రామాన్ని సందర్శిం చారు. బందరు మండలం చిన్నాపురంలో 250 మందికి పైగా విషజ్వరాల బారినపడ్డారు. ఈ గ్రామంలోనూ వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యశిబి రాల్లో నామమాత్రంగా మందులు ఇస్తుండటంతో రోగులు విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రాంత కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

 జ్వరపీడితులు 2,56,244 మంది
 జిల్లాలో ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు 2,56,244 మందికి జ్వరం సోకిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 157 మలేరియా కేసులు, 44 డెంగీ కేసులని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. 8,800 మందికి టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించగా 2,843 మందికి టైఫాయిడ్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం జ్వరం రాగానే విపరీతమైన ఒళ్లు నొప్పులు వచ్చి నాలుగైదు రోజులు తగ్గడంలేదు. కొందరికి రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతోంది. తీవ్రజ్వరం బారినపడిన వారు పీహెచ్‌సీలకు వెళ్తే డెంగీ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం లేని పరిస్థితి ఉంది.

గత ఏడాది మచిలీపట్నం, విజయవాడ ప్రభుత్వాస్పత్రులకు డెంగీ నిర్ధారణ కిట్లు ఇచ్చారు. ఈ ఏడాది మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి డెంగీ నిర్ధారణకిట్లు ఇచ్చినా పెద్దగా ఇక్కడ పరీక్షలు జరపని పరిస్థితి ఉంది. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో రెండు నెలల్లో నాలుగు డెంగీ కేసులే నమోదయ్యాయని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు.

 డెంగీ కేసులను దాచేస్తున్నారా..!
 జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ విషజ్వరాలు ఉన్నాయి. పీహెచ్‌సీల్లో సరైన వైద్యసేవలు అందక జ్వరపీడితులు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. డెంగీకేసులను నిర్ధారిస్తే ఆస్పత్రులపై చర్యలు తప్పవని జిల్లా వైద్యశాఖాధికారులు జారీ చేసిన హెచ్చరికలతో ప్రైవేటు వైద్యుల తమ వద్దకు వచ్చిన రోగులకు సివియర్ ఫీవర్ అనే కొత్త పేరు పెట్టి చికిత్సచేస్తున్నారు. రక్తంలో తెల్లరక్త కణాల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు ఇంజక్షన్లు చేస్తున్నారు. ఒక్కొక్క ఇంజక్షన్‌కు రూ.2300 చొప్పున వసూలు చేస్తున్నారు. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉంటే మూడు నుంచి ఐదు ఇంజక్షన్లు చేయాల్సి వస్తోంది.

ఇవి కాకుండా డెంగీ లక్షణాలను తగ్గించేందుకు చేస్తున్న కోర్స్ ఇంజక్షన్లకు రూ.1600 ఖర్చవుతోందని రోగులు పేర్కొంటున్నారు. డెంగీ లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లిన రోగులు కోలుకునేందుకు రూ.30 వేల నుంచి రూ.35 వేల ఖర్చు చేయాల్సి వస్తోంది. రోగులు డిశ్చార్జి అయ్యే సమయంలో ‘ఇంతకాలం మీరు డెంగీకి చికిత్సపొందారు. అయితే అధికారికంగా ధ్రువీకరించలేం. మందులు జాగ్రత్తగా వాడండి’ అని వైద్యులు చెప్పి పంపుతున్నారు.

బందరు మండలం వాడపాలేనికి చెందిన కాండ్ర వెంకటేశ్వరరావు, బొడ్డు లక్ష్మణరావు, ఇంతేటి శేషారావు డెంగీ లక్షణాలతో చికిత్స పొందారు. కాండ్ర వెంకటేశ్వరరావు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో డెంగీకి చికిత్స చేయించుకున్నారు. దీంతో అతనికి మాత్రమే డెంగీ సోకిందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 44 డెంగీ కేసులు నమోదయ్యాయి. వీటిలో విజయవాడలో మూడు, మిగిలినవి జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు