ఆత్మపరిశీలన చేసుకోవాలి

31 Aug, 2014 00:48 IST|Sakshi
ఆత్మపరిశీలన చేసుకోవాలి

 గంగవరం : అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఆత్మపరిశీలన చేసుకోవాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి హితవు పలికారు. శనివారం సాయంత్రం గంగవరంలో మండల కన్సీనర్ కల్లం సూర్యప్రభాకర్ అధ్యక్షతన జరిగిన వైఎస్సార్ సీపీ మండల కార్యకర్తల సమావేశంలో ఆమెతో పాటు పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్(బాబు) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజేశ్వరి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌లో మహిళలకు గౌరవం లేదని, విలువే లేదని ఎంపీ గీత వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు.
 
 పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని, ఇందుకు అరకు పార్లమెంటరీ పరిధిలో ఎక్కువ శాతం మహిళా అభ్యర్థులకే సీట్లు ఇవ్వడం నిదర్శనమన్నారు. ఆయన ఆశీస్సులతో టిక్కెట్ దక్కించుకుని, పార్టీ కార్యకర్తలు, నాయకుల శ్రమతో ఎంపీగా గెలుపొందిన గీత.. పార్టీకి వెన్నుపోటు పొడి చి, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రంపచోడవరం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, నాయకులపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులపై శాసన సభలో ప్రస్తావిస్తానన్నారు.
 
 కార్యకర్తలకు అండగా ఉంటా : అనంతబాబు
 తనపై, కార్యకర్తలపై అధికార పార్టీ, పార్టీలోని అంతర్గత శత్రువులు ఎన్ని కుట్రలు, వెన్నుపోటు రాజకీయాలు చేసినా.. వైఎస్సార్‌కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలుస్తామని అనంత ఉదయభాస్కర్ అన్నారు. అధికార పార్టీ వేధింపులు, కవ్వింపు చర్యలకు భయపడొద్దని, సమర్ధవంతంగా ఎదుర్కొందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రంపచోడవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ బలమైన శక్తిగా ఉందని, దానిని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు.
 
 పార్టీ మరింత బలోపేతం కావడానికి కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు ఎంపీ గీతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమావేశంలో నెల్లిపూడి ఎంపీటీసీ సభ్యురాలు ఆదిలక్ష్మి, సర్పంచ్ అక్కమ్మ, డీసీసీబీ డెరైక్టర్ యెజ్జు వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు కొటికలపూడి రామతులసీ, డాక్టర్ సీహెచ్ చిన్నస్వామి, వైఎస్ ప్రసాద్, సూరంపూడి ఏడుకొండలు, దిండి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు