ఏపీలో పెట్టుబడులు పెట్టండి: సీఎం

9 Feb, 2018 02:06 IST|Sakshi
సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: విమానయాన రంగంలో ఏపీ ప్రభుత్వంతో కలసి జాయింట్‌ వెంచర్‌ ప్రారంభించాలని దుబాయ్‌ ఎమిరేట్స్, ఏరో స్పేస్‌ సంస్థలను సీఎం చంద్రబాబు కోరారు. గురువారం దుబాయ్‌లో దుబాయ్‌ ఎమిరేట్స్, దుబాయ్‌ నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ చైర్మన్‌ షేక్‌ అహ్మద్‌ బీన్‌ సయీద్‌ అల్‌ మక్దూమ్‌తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ తయారీ, విమానాల ఇంటీరియర్, డ్యూరబుల్స్‌ తయారీ కేంద్రాలను ఏపీలో ఏర్పాటు చేసేందుకు ఎమిరేట్స్‌ గ్రూప్‌ ముందుకు వచ్చింది. అలాగే ఏవియేషన్‌ శిక్షణ కోసం ఒక అకాడమీని నెలకొల్పాలని, మెయింటెనెన్స్‌ రిపేర్‌ అండ్‌ ఓవర్‌ హాల్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు సీఎం సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అభివృద్ధి మండలి(ఏపీఈడీబీ)తో ఎమిరేట్స్‌ గ్రూప్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలాఉండగా దుబాయ్‌ ఎయిర్‌ పోర్టు ఫ్రీ జోన్‌ అథారిటీ డైరెక్టర్‌ జనరల్, దుబాయ్‌ సిలికాన్‌ ఒయాసిస్‌ అథారిటీ వైస్‌ చైర్మన్, దుబాయ్‌ ఏరో స్పేస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మహమ్మద్‌ అల్‌ ఝరూనీతో సీఎం చంద్రబాబు సమావేశ మయ్యారు. ఏపీలో ఏరో సిటీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నామని, ఇందుకోసం సౌదీ అరేబియా ఫైనాన్షియర్స్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ఝరూనీ సీఎంకు వివరించారు. కాగా, లులూ గ్రూప్‌ ప్రతినిధులు సీఎంను కలసి విశాఖలో తాము ఏర్పాటు చేయనున్న కన్వెన్షన్‌ సెంటర్‌కు సంబంధించిన ఆకృతులను చూపించారు.   

మరిన్ని వార్తలు