గెయిల్ తప్పిదాలే కారణం

10 Sep, 2014 10:48 IST|Sakshi
గెయిల్ తప్పిదాలే కారణం

‘నగరం’ పేలుడుపై స్పష్టం చేసిన విచారణ కమిటీ నివేదిక
 న్యూఢిల్లీ: తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో జూన్ 27న జరిగిన విస్ఫోటనానికి ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్) తప్పిదాలే కారణమని చమురు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తేల్చింది. ఈ ఘటనలో 22 మంది మృతి మరణించడం తెలిసిందే. దీనిపై విచారణకు చమురు మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి(రిఫైనరీస్) రాజేష్‌కుమార్ సింగ్ సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సమర్పించింది. వినియోగదారులకు డ్రై గ్యాస్ సరఫరా కోసం తాటిపాక-కొండపల్లి పైప్‌లైనును గెయిల్ నిర్మించింది.
 
 అయితే ఈ పైప్‌లైనులో నీటితో కూడిన, అధికంగా మండే స్వభావం కల హైడ్రోకార్బన్ల మిశ్రమంతో కూడిన సహజవాయువు సరఫరా అవుతుండడంతో పైపులైను తుప్పుపట్టిపోయి.. అది లీకేజీకి దారితీసిందని, తద్వారా వెలువడిన గ్యాస్ వాతావరణంలోకి దట్టంగా వ్యాపించి.. పేలుడుకు కారణమైందని నివేదిక వెల్లడించింది. ఈ పేలుడు వ్యవహారానికి వ్యక్తిగతంగా ఎవరు కారణమనేది నిర్ధారించడం కష్టసాధ్యమని తెలిపింది. అయితే అత్యధిక పీడనంతో సహజవాయువు సరఫరా జరిగే ఈ పైపులైన్లను పదేపదే మరమ్మతు చేయడంలో గెయిల్ సరైన విధానాలు పాటించకపోవడం ఈ పేలుడుకు దారితీసిన కారణాల్లో ఒకటని తేల్చింది. సహజవాయువుతోపాటు కార్బన్ డైఆకై ్సడ్, నీరు, సల్ఫర్ పైపులైన్లలో సరఫరా అవుతుండడంతో కాలక్రమంలో పైపులైను తుప్పుపట్టిందని తెలిపింది. సహజవాయువు నుంచి నీటిని, హైడ్రోకార్బన్ ద్రవాల మిశ్రమాన్ని  తొలగించేందుకోసం పైపులైన్ ప్రారంభమయ్యే తాటిపాక వద్ద గ్యాస్ డీహైడ్రేషన్ యూనిట్(జీడీయూ)ను ఏర్పాటు చేస్తానన్న తన హామీని గెయిల్ నిలుపుకోలేదని తప్పుపట్టింది. అదే కనుక ఏర్పాటైనట్లయితే పైపులైను కోతకు గురికాకుండా నివారించడానికి, లీకేజీని నిరోధించడానికి వీలయ్యేదని తెలిపింది.
 
 ఇవీ సిఫార్సులు..: పైపులైన్ల నుంచి స్వచ్ఛమైన సహజవాయువు సరఫరా అయ్యేలా చూడాలి. ఇందుకుగాను అందులో ఉండే నీటిని, మండేస్వభావం కల హైడ్రోకార్బన్ ద్రవాల మిశ్రమాన్ని తొలగించేందుకు వీలుగా గ్యాస్ డీహైడ్రేషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలి.  పైపులైన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి.  లీకేజీలను కనిపెట్టేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.  నిర్వహణపరమైన వైఫల్యాలపై వివిధ స్థాయిల్లో గెయిల్ అంతర్గత విచారణను తప్పక పూర్తి చేయాలి. లోపాలకు బాధ్యులెవరో గుర్తించాలి.
 
 జగన్ కేసులో మరో చార్జిషీట్
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ మరో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందూ ప్రాజెక్టుకోసం రాష్ట్ర హౌసింగ్ బోర్డుకు సంబంధించిన భూములను కేటాయింపు చేయడంపై ఈ చార్జిషీట్ సమర్పించింది. సీబీఐ ఎస్పీ చంద్రశేఖర్.. చార్జిషీట్ ప్రతిని మంగళవారం ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగికి అందజేశారు. రెండు పెట్టెల్లో అనుబంధ పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఇందూ ప్రాజెక్టుకు భూకేటాయింపుల్లో క్విడ్‌ప్రోకో జరిగిందని సీబీఐ ఆరోపించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సీబీఐ 2013 సెప్టెంబర్ 17న 10వ చార్జిషీట్ దాఖలు చేయడం తెలిసిందే. తాజా చార్జిషీట్‌తో కలిపి ఈ కేసులో సీబీఐ ఇప్పటికి 11 చార్జిషీట్లు దాఖలు చేసింది. 10వ చార్జిషీట్ దాఖలు చేసిన దాదాపు ఏడాది తర్వాత ఈ చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. ఇందులో నిందితులుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, ఎస్‌ఎన్ మొహంతి, ఐ.శ్యాంప్రసాద్‌రెడ్డి, ఇందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, వైవీ సుబ్బారెడ్డి, వీవీ కృష్ణప్రసాద్, ఛిడ్‌కో ప్రైవేట్ లిమిటెడ్, వసంత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందూ ఈస్ట్రన్ ప్రొవిన్స్, జితేంద్ర విర్వానీ, ఎంబసీ రియల్టర్స్, ఇందూ రాయల్ హోం ప్రైవేట్ లిమిటెడ్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లను పేర్కొంది.
 
 సీబీఐ కోర్టులో హాజరైన జగన్: తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి బాలయోగి ఎదుట హాజరయ్యారు. తదుపరి విచారణను ఈ నెల 23కు జడ్జి వాయిదా వేశారు. కాగా వైఎస్ జగన్ బెంగళూరు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. మంగళవారం నుంచి డిసెంబర్ 31 వరకు ఇందుకు అనుమతినిస్తూ న్యాయమూర్తి బాలయోగి ఉత్తర్వులు జారీచేశారు. బెంగళూరు వెళ్లే ముందు కోర్టుకు సమాచారమివ్వాలని షరతు విధించారు.

>
మరిన్ని వార్తలు