ఏపీలో సిట్‌ ప్రకంపనలు

1 Mar, 2020 04:09 IST|Sakshi

గత టీడీపీ సర్కారు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలపై విచారణ బాధ్యతలను ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ సర్కారు తీసుకున్న లోపభూయిష్ట నిర్ణయాలు, వీటి వెనుక లోగుట్టు, ఫలితంగా రాష్ట్ర ఖజానాకు వాటిల్లిన నష్టం, రాజధాని అమరావతి పేరిట సాగిన భూ కుంభకోణంతోపాటు అన్ని అక్రమాలపై ‘సిట్‌’ దర్యాప్తు చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) మొదలు అడ్డగోలుగా భూకేటాయింపులు, రాజధాని నిర్మాణం ముసుగులో యథేచ్ఛగా సాగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, అసైన్డ్‌ చట్టాన్ని తుంగలో తొక్కి గత పాలకులు బినామీ పేర్లతో కొనసాగించిన భూముల కొనుగోలు లాంటి ఏ అంశాన్నయినా సిట్‌ విచారణ పరిధిలోకి తీసుకోవచ్చని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది.

►ఐపీఎస్‌ అధికారి, ఇంటెలిజెన్స్‌ విభాగం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(డీఐజీ) కొల్లి రఘురాంరెడ్డి నేతృత్వంలో 10 మంది పోలీసు అధికారులతో కూడిన ‘సిట్‌’ బృందానికి  ప్రభుత్వం విశేష అధికారాలు కల్పించింది. ఈ బృందం వెంటనే రంగంలోకి దిగి, కార్యాచరణ ప్రారంభించింది.   
►అధికార రహస్యాలను కాపాడుతామంటూ చేసిన ప్రతిజ్ఞను గత టీడీపీ పాలకులు తుంగలో తొక్కారు. రాజధాని ఎక్కడొస్తుందో ముందే తమ వారికి లీకులిచ్చి కారుచౌకగా భూములు కొనుగోలు చేయడానికి సహకరించినట్లు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమిక అధ్యయనంలో తేలింది.  
►అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ సంస్థ అమరావతి ప్రాంతంలోని తాడికొండ మండలం కంతేరులో విలువైన భూములు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్‌ పత్రాలు దొరికాయి. లంక, పొరంబోకు, ప్రభుత్వ భూములను సైతం కొట్టేసినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి.  
►అస్మదీయులకు అయాచిత లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా కోర్‌ రాజధానిని 395 చదరపు కిలోమీటర్ల నుంచి 217 చదరపు కిలోమీటర్లకు తగ్గించినట్లు బహిర్గతమైంది.  
►797 మంది తెల్ల రేషన్‌ కార్డుదారులు అమరావతి ప్రాంతంలో రూ.కోట్ల విలువైన భూములను కొన్నట్లు సీఐడీ దర్యాప్తులోనూ తేలింది. ఇవన్నీ టీడీపీ నేతలు బినామీ పేర్లతో కొన్నవేనన్న విషయం ‘సిట్‌’ దర్యాప్తులో బట్టబయలవుతుందని ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.  
►సిట్, ఈడీ దర్యాప్తులో ఎక్కడ తమ గుట్టు రట్టవుతుందోనని టీడీపీ నేతలు, గత పాలకుల్లో గుబులు రేగుతోంది. ఇప్పటికే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఈడీ కేసు నమోదైంది.  
►సిట్‌ అధిపతి, ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురాంరెడ్డి బృందం విజయవాడలో మెరుపు దాడులు చేసింది. అమరావతిలో భూములు కొనుగోలు చేసిన తెల్లరేషన్‌ కార్డుదారుల వెనుక ఉన్న బినామీల గుట్టును రట్టు చేసేందుకు టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు జరిపింది. వీరిలో టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీప బంధువు కూడా ఉన్నారు. ఈ సోదాల్లో విలువైన డాక్యుమెంట్లు దొరికాయి.

మరిన్ని వార్తలు