గిరిజన సంక్షేమంలో ఫిర్యాదులపై విచారణ

24 Sep, 2014 00:30 IST|Sakshi
గిరిజన సంక్షేమంలో ఫిర్యాదులపై విచారణ

కర్నూలు(అర్బన్):
 గిరిజన సంక్షేమశాఖ జిల్లా కార్యాలయంలో సిబ్బంది పనితీరు, నిధుల దుర్వినియోగం పై  వెల్లువెత్తిన ఫిర్యాదులపై ఆ శాఖ కమిషనరేట్‌లో డిప్యూటీ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్. రత్నమాల విచారణ చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కర్నూలుకు చేరుకున్న ఆమె మంగళవారం మధ్యాహ్నం వరకు జిల్లా కార్యాలయంలో, నగరంలోని ఆ శాఖ కార్యాలయాలకు వెళ్లి పలు ఫైళ్లను పరిశీలించారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యాలయ ఉద్యోగులను ఆమె ప్రత్యేకంగా ఒక్కొక్కరిని పిలిపించి విచారించి రాత పూర్వకంగా వారి వాదనలను రికార్డు చేశారు. ఈ నేపథ్యంలోనే  గిరిజన విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు పలువురు  కార్యాలయానికి వచ్చి  డీడీకి వినతి పత్రాలను అందజేశారు. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒకరిద్దరు ఉద్యోగులపై ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసులు నమోదైన విషయాన్ని కూడా ఆమె తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే గిరిజన సంక్షేమంలో భాగంగా వివిధ పథకాల అమలుకు సంబంధించి విడుదలవుతున్న నిధులు, వాటి వినియోగం తదితర విషయాలను ఆరా ఆమె తీశారు. అధికారి, సిబ్బంధి మధ్య ఉన్న సమన్వయంతో పాటు కార్యాలయంలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే ఫిర్యాదు మేరకు ఆయా ఫైళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ విచారణకు వచ్చిన విషయం వాస్తవమేనని, అయితే ఫిర్యాదులకు సంబంధించి చేపట్టిన విచారణ కాన్ఫిడెన్షియల్ అని, విచారణ నివేదికలతో పాటు  సంబంధిత ఫైళ్లను కమిషనర్‌కు అందజేస్తామని డీడీ చెప్పారు.

 

 

మరిన్ని వార్తలు