చిక్కుల్లో పాడేరు డీఎల్‌పీఓ ?

20 Jun, 2015 02:09 IST|Sakshi

- నివేదిక ఇవ్వడంలో అలసత్వం వహినందుకే?
- నేడో రేపో కమిషనర్‌కు ఫిర్యాదు
- డీఎల్‌పీఓకు రెండు నోటీసులు ఇచ్చిన డీపీఓ!
మహారాణిపేట:
నిధులు దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదులో విచారణ చేపట్టిన పాడేరు డివిజనల్ పంచాయతీ అధికారి రామ్‌ప్రసాద్ చిక్కుల్లో కూరుకుపోతున్నట్లు కనబడుతోంది. నిధుల దుర్వినియోగం పూర్తి స్థాయి విచారణ చేపట్టకపోవడంపై పలు అనుమానాలు వస్తుండడంతో.. పై అధికారులు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నారు. పాడేరు డివిజన్‌లో పది నెలల కిందట 18 పంచాయతీల్లో సుమారు రూ. 57 లక్షల నిధులు దుర్వినియోగం అయ్యాయని ఓ ఎమ్మెల్సీ కలెక్టర్ చేసిన ఫిర్యాదుతో అసలు డొంక కదిలింది.

ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయో విచారణ చేపట్టి ఆ నిధులను వెనక్కి రాబట్టాలని జిల్లా పంచాయతీ అధికారి టి.వెంకటేశ్వరావును కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆయన డీఎల్‌పీఓ రామ్ ప్రసాద్‌ను దీనిపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఇదంతా గతేడాది ఆగస్టులో జరిగిన తతంగం.

దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఒక్క డుంబ్రిగూడ మండలంలోనే 18 పంచాయతీల్లోనే రూ.57.76లక్షలు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. దీంతో ఆయా పంచాయతీల సర్పంచ్‌ల చెక్ పవర్‌లను రద్దు చేసి ఆ అధికారాన్ని ఈఓపీఆర్టీలకు అప్పగించారు. పంచాయతీల్లో అవసరం మేరకే నిధులు డ్రా చేసి ఖర్చు చేయాలని ఆదేశించారు. అలాగే ఈ పంచాయతీల్లో పని చేస్తూ నిధులు దుర్వినియోగానికి పాల్పడిన గ్రామ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారిని కోరారు.

ఏడాదవుతున్నా నిధులు ఎందుకు రికవరీ చేయలేదు..
నిధులు దుర్వినియోగం పై విచారణ జరిగి పదినెలలవుతున్నా ఆ నిధులను ఎందుకు రికవరీ చేయలేకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధులకు డీఎల్‌పీఓ కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఉండడంతో.. ఈ విచారణ నివేదికను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయారని పలువురు అంటున్నారు. సోమవారంలోగా నిధుల దుర్వినియోగం పై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వకపోతే డీఎల్‌పీఓ పై పంచాయతీ శాఖ కమిషనర్ కు కలెక్టర్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో డీఎల్‌పీఓకు డీపీఓ రెండు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.  మరి ఈ నిధుల భాగోతం ఏ మలుపులు తిరుగుతుందో మరి.?  
 
చెక్ పవర్ రద్దు చేశాం..
నిధుల దుర్వినియోగం అవుతున్నాయనే ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. జిల్లాలో పాడేరు డివిజన్లో 18 పంచాయతీల సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేశాం. నిధుల రికవరీకి ఆదేశించాం. త్వరలో నిధులు వెనక్కి రాబడతాం. వీటితో పాటు విశాఖ డివిజన్లో మరో 4 పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలపై చేపట్టిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఆయా సర్పంచ్‌ల చెక్‌పవర్‌లను రద్దు చేశాం.    
టి.వెంకటేశ్వరరావు,జిల్లా పంచాయతీ అధికారి

మరిన్ని వార్తలు