అసమానతలు రూపుమాపేందుకు కళలు దోహదం

11 Jun, 2015 03:46 IST|Sakshi

సినీనటుడు పరుచూరి వెంకటేశ్వరరావు
ముగిసిన రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు

 
 తెనాలిటౌన్ : సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపేందుకు, యువకులను చైతన్య పరిచేందుకు కళలు, క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ప్రముఖ సినీనటుడు, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. రూరల్ మండలం కొలకలూరు గ్రామంలోని కొలకలూరు గ్రామ కళాపరిషత్ ఆధ్వర్యంలో ప్రథమ రాష్ర్టస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు మంగళవారం రాత్రి ముగిశాయి. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ సినీ, నాటక రచయిత మోదుకూరు జాన్సన్‌తో తమకు ఉన్న పరిచయాలను గుర్తు చేశారు. జాన్సన్ స్వగ్రామమైన కొలకలూరులో కళాపరిషత్‌ను ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయి నాటిక పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 

రంగస్థల రచయిత, నంది అవార్డుగ్రహీత డాక్టర్ కందిమళ్ల సాంబశివరావును శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.   విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.  సభకు నటులు పొన్నెకంటి పోతురాజు అధ్యక్షత వహించారు. నటులు సుద్దపల్లి శరత్‌వెంకయ్య స్వాగతోపన్యాసం చేశారు.  పరుచూరి వెంకటేశ్వరరావును  పరిషత్ నిర్వాహకులు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.

 ఉత్తమ ప్రదర్శనలు..
  నాటిక పోటీలలో ఉత్తమ ప్రదర్శనగా మణికంఠ ఆర్ట్స్-ఫిఠాపురం వారి ఆచంద్రార్కం నాటిక , ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక-గుంటూరు వారి అక్షయ నాటిక, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా మూర్తి కల్చరల్ అసోసియేషన్-కాకినాడవారి సంచలనం నాటిక ఎన్నికైనట్లు న్యాయనిర్ణేతలు ప్రకటించారు. వ్యక్తిగత విభాగాలలో దర్శకునిగా, రచయితగా చెలికాని వెంకట్రావు(ఆచంద్రార్కం), నటుడిగా శ్రీను(ఆచంద్రార్కం), నటిగా అమృతవర్షిణి(అక్షయ), క్యారెక్టర్ నటుడిగా ప్రసాద్(పృథ్వీసూక్తం), ప్రతి నాయకునిగా రఘు(ఆచంద్రార్కం), హాస్యనటునిగా శివప్రసాద్ (అంతభ్రాంతియే), డైలాగ్ ఆర్టిస్ట్‌గా జానకినంద్ (సంచలనం), సంగీతం లీలామోహన్(అక్షయ), రంగ అలంకరణ నాగు(ఆచంద్రార్కం), ఆహార్యం శేషగిరి(సంచలనం) ఎంపికయ్యారు.  కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పోరేషన్ ఈడీ బాలాజీ నాయక్, నటుడు గోపరాజు రమణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు