పేదల ఆరోగ్యానికి అయోడైజ్డ్‌ ఉప్పు 

15 Mar, 2020 05:07 IST|Sakshi

రాయితీపై పంపిణీ చేస్తున్న రాష్ట్ర సర్కారు 

అంగన్‌వాడీ సెంటర్లలోనూ వినియోగానికి ఆదేశం 

270 మెట్రిక్‌ టన్నుల సేకరణకు టెండర్లు  

సాక్షి, అమరావతి: పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐరన్‌ ఫోర్టిఫైడ్‌ అయోడైజ్డ్‌ ఉప్పును రాయితీపై పంపిణీ చేస్తోంది. తాజాగా రేషన్‌ షాపుల ద్వారా బియ్యం కార్డులున్న లబ్ధిదారులందరికీ సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు అంగన్‌వాడీ సెంటర్లలోనూ ఈ ఉప్పును వినియోగించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఐసీడీఎస్‌ ద్వారా తయారు చేసే ఆహారంలో ఆయోడైజ్డ్‌ ఉప్పును వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పును సేకరించేందుకు పౌర సరఫరాల సంస్థ టెండర్లను ఆహ్వానించింది. ఏప్రిల్‌ నుండి నెలకు 45 మెట్రిక్‌ టన్నుల చొప్పున సెప్టెంబర్‌ వరకు 270 మెట్రిక్‌ టన్నుల ఉప్పును సేకరించనున్నారు. ప్రభుత్వం సూచించిన ప్రమాణాల ప్రకారం ఉప్పును సరఫరా చేయకపోతే టెండర్లను మధ్యలోనే రద్దు చేస్తామని అధికారులు ముందుగానే షరతు విధించారు. ఏడాదికి రూ.15 లక్షల వరకు టర్నోవర్‌  ఉన్న సంస్థలు మాత్రమే టెండర్లలో పాల్గొనాల్సి ఉంటుంది.   

- ఆహార పరిరక్షణ, ప్రమాణాల నిబంధన చట్టం–2006 ప్రకారం సాధారణ వ్యక్తులు  రోజుకు 150 మైక్రో గ్రాములు, గర్భిణి లేదా పాలిచ్చే తల్లి 250 మైక్రో గ్రాములు, 11 నెలల చిన్నారులకు 50 మైక్రో గ్రాములు, 5 ఏళ్లలోపు బాలలకు 90 మైక్రో గ్రాములు,  6 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు 150 మైక్రో గ్రాముల అయోడైజ్డ్‌ ఉప్పు అవసరం.  
- కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం.. జనాభాలో సగం మందికి పైగా అయోడైజ్డ్‌ ఉప్పు 
తీసుకోవడం లేదని వెల్లడైంది. 
- చిన్న పిల్లల్లో శారీరక ఎదుగుదలకు అయోడైజ్డ్‌ ఉప్పు ఎంతో అవసరం.  
- గర్భిణులకు, పాలిచ్చే తల్లులు తగినంతగా అయోడిన్‌ వాడాల్సి ఉంటుంది. 

అయోడిన్‌ లోపం వల్ల కలిగే నష్టాలు 
- చిన్న పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ దానికి తగ్గట్టు చురుకుదనం లేకపోవడం. 
- చాలామందిలో జ్ఞాపకశక్తి మందగించడం. 
- గర్భిణుల్లో గర్భస్రావం లేదా బిడ్డ కడుపులోనే మృతి చెందడం, మృతి చెందిన శిశువు జన్మించడం. 
పిల్లలు మరుగుజ్జుతనంతో జన్మించే అవకాశాలు ఎక్కువ. 
- గాయిటర్‌ (గొంతువాపు) లేదా అంగవైకల్యంతో జన్మించడం 
- నరాల బలహీనతతో బాధపడటం.  
- చెవుడు, మూగతనంతో పిల్ల లు పుట్టే అవకాశం ఎక్కువ.   

మరిన్ని వార్తలు