తెలుగుదేశంలో ముస్లింలకు అన్యాయం

6 Dec, 2018 11:26 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న ఇక్బాల్‌ అహ్మద్‌

పీలేరు: ‘అధికారం ఉన్నా, లేకపోయినా టీడీపీ కోసం ఎన్నో అవమానాలు భరించాను. అయినా సీఎం చంద్రబాబు ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు’  తెలుగుదేశం పార్టీ పీలేరు నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి, ప్రముఖ ముస్లిం మైనారిటీ నేత డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ ఆవేదన ఇది. బుధవారం రాత్రి పీలేరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారాయన. ఆయన ఏమన్నారంటే.. ‘పాతికేళ్లుగా టీడీపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పని చేశాను. నాయకత్వం మారినా ఎన్‌టీఆర్‌పై అభిమానంతో నల్లారి కుటుంబానికి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉంటూ సేవ చేశా.  2014లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనపై పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పరిస్థితులు బాగాలేవు... మరొకరికి టికెట్‌ ఇస్తే పనిచేస్తానన్నా. పిల్లల చదువు,  భవిష్యత్తు చూసుకుంటానని భరోసా ఇచ్చారు. కానీ టికెట్‌ ఇవ్వడంతోనే సరిపెట్టుకున్నారు. సీఎం రమేష్‌ అన్నీ  చూసుకుంటారని భరోసా ఇచ్చినా ఎలాంటి సాయం చేయలేదు. పైగా నాకు వ్యతిరేకంగాచాలామంది పనిచేశారు. గెలిస్తే క్యాబినెట్‌ మంత్రిని చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీలో ఒక్క పీలేరులోనే ముస్లిం మైనారిటీకి టికెట్‌ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మూడన్నర సంవత్సరాలు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను గడపగడపకూ తీసుకెళ్లాను. సీఎం నన్ను విజయవాడకు పిలిపించి పీలేరు గెలవాలంటే నల్లారి కుటుంబాన్ని పార్టీలో చేర్చుకోవాలన్నారు. నెలలోపు క్యాబినెట్‌ హోదా గల నామినేటెడ్‌ పోస్టు ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఏడాది కావస్తున్నా పదవి ఇవ్వలేదు. పైగా కిషోర్‌ చేరిన వెంటనే పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలతో పాటు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వడం సబబా అని ఇక్బాల్‌ అహ్మద్‌ ప్రశ్నించారు.

ఇంకా ఏమన్నారంటే..
కిషోర్‌ వచ్చాక  నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఆయనతో ఇమడలేమన్నారు. అందరినీ కలుపుకుని ఆత్మీయ సమావేశం నిర్వహించి మూడు నాలుగు సార్లు సీఎంను కలిశాను.  ఇబ్బందులు చెప్పినా పట్టించుకోలేదు. ముస్లిం మైనారిటీ నాయకుడు కావడం వల్లే గుర్తింపు లేకుండా పోయింది.  బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాకే బాబుకు మేం గుర్తుకొచ్చాం. నాలుగన్నరేళ్లుగా ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ లేరు. మైనారిటీ ఓట్ల కోసం ఫరూక్‌ను మంత్రి చేశారు. సైకిల్‌ గుర్తుపై గెలిచిన ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే ఒక్కరూ లేరు. నారా హమారా సభలో  ప్లకార్డులు ప్రదర్శించిన ముస్లిం యువకులపై కేసులు బనా యించారు. వైఎస్సార్‌సీపీలో టికెట్లు పొందిన నలుగురు మైనారిటీలు గెలిచారు. పూర్తిగా విసిగిపోయాను. అందుకే టీడీడీకి రాజీనామా చేస్తున్నాను. ఎమ్మెల్సీ దొరబాబు వచ్చి పార్టీలో గుర్తింపు ఇస్తామని, సీఎం న్యాయం చేస్తారని చెప్పారు. నా నిర్ణయంలో మార్పు ఉండదని స్పష్టం చేశానని ఇక్బాల్‌ అహ్మద్‌  చెప్పారు.  టీడీపీలో మైనారిటీలు సెకండ్, థర్డ్‌ క్లాస్‌ పౌరులేనని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీకి పలువురు రాజీనామా...
డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌తో పాటు జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఫయాజ్‌ అహ్మద్‌ఖాన్, మహల్‌ ఎంపీటీసీ సభ్యురాలు ఫర్వీన్, జిల్లా మైనారిటీ కార్యదర్శి రిజ్వాన్, మారేళ్ల మాజీ సర్పంచ్‌ రమణ, గుర్రం కొండ పట్టణ ఉపాధ్యక్షుడు గయాజ్‌అహ్మద్, గ్రామ కమిటీ సభ్యుడు జిలానీ, బీసీ సెల్‌ కలకడ ఉపాధ్యక్షుడు రామచంద్ర, జిల్లా సెల్‌ కార్యదర్శి రిజ్వాన్, బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు గంగయ్య, విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సద్దాం హుసేన్, జిల్లా ఎస్సీ సెల్‌ నాయకుడు ఏసురాజు, గోవిందస్వామి తదితరులు పార్టీకి రాజీనామా చేసినట్లు  ప్రకటించారు.

మరిన్ని వార్తలు