కోట్లు కొట్టేశారు..

5 Oct, 2019 09:28 IST|Sakshi

గత పాలకుల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.. టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగిన అవినీతి బయటికొస్తోంది.. వలంటీర్ల వ్యవస్థతో అసలు రంగు పైకి తేలుతోంది.. కొంతమంది డీలర్ల సాయంతో ఇన్నాళ్లూ బియ్యం మెక్కిన అక్రమార్కుల బండారం బయటపడుతోంది. క్షేత్ర స్థాయిలో బీపీఎల్‌ రేషన్‌ కార్డుదారులకు వారి ఇంటికే బియ్యం అందజేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో బియ్యం దొంగలు బయటపడుతున్నారు. ఒక్క నెలలోనే ఎన్నో అవకతవకలు తేటతెల్లమయ్యాయి. నెలకు సుమారు రూ.11 లక్షల విలువ చేసే బియ్యం పక్కదారి పడుతున్నట్టు తేలింది. అంటే ఏడాదికి కోటి రూపాయలకు పైమాటే. 

సాక్షి, శ్రీకాకుళం : ఇది ఆరంభం మాత్రమే. ఒక్క నెలలోనే ఇంత అక్రమం బయటపడితే మరో రెండు మూడు నెలల్లో పరిస్థితి అంతా చక్కబడ్డాక మరెంత అవినీతి వెలుగు చూస్తుందో! ఈ పాపం కేవలం టీడీపీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీలదే. వారికి తోడుగా కొంతమంది  డీలర్లు, మరికొంతమంది పౌరసరఫరాల సిబ్బంది ఉన్నట్టు అభియోగాలు  వినిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను కట్టుదిట్టం చేయడం, అవినీతిని చెక్‌ పెట్టే దిశగా వెళ్లడంతో వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది.
 
ఒక్క నెలలోనే భారీ వ్యత్యాసం 
అక్టోబర్, సెప్టెంబర్‌ నెలల మధ్య ఒక్క నెల వ్యవధిలోనే ఇటువంటి దొంగ కార్డులు, యూనిట్ల బాగోతం బయటపడింది. ఈ కార్డుల్లో ప్రధానంగా గ్రామంలో లేనివారు, దీర్ఘకాలికంగా వలసలు వెళ్లిపోయి ఇతర రాష్ట్రాల్లో స్ధిరపడిన వారు ఉన్నారు. అలాగే యూనిట్లలో ఉద్యోగం చేస్తున్నవారు, వివాహాలు అయిన తరువాత వేరే కార్డులో ఉన్నవారు, మరణించిన వారు ఉన్నారు. ఈ యూనిట్లను కార్డుల నుంచి తొలగించకుండా వారి పేరును కొనసాగించి, ఆ బియ్యాన్ని టీడీపీ కార్యకర్తలు స్వాహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని వలంటీర్లు గుర్తించి ఫిర్యాదులు చేయడంతో వారి బండారం బయటపడుతోంది.  

నెలకు రూ.11 లక్షల వరకు అవినీతి 
సెప్టెంబర్‌కు, అక్టోబర్‌ నెలకు మధ్య 1950 బీపీఎల్‌ కార్డులు, 7039 యూనిట్లు తేడా వచ్చాయి. ఒక యూనిట్‌కి ప్రతి నెల 5 కిలోల బియ్యం అందజేస్తారు. అంటే 7039 యూనిట్లకు 35,195 కిలోలు. ఒక కిలో బియ్యానికి ప్రభుత్వం రూ.33.50 ఖర్చు చేస్తుంది.  35,195 కిలోలకు నెలకు రూ.11,08,642లు అడ్డుతోవలో కొన్ని నెలలుగా ఈ బియ్యం పక్కతోవ పడుతున్నాయని తెలుస్తోంది. ఇలా ఏడాదికి లెక్కకడితే ఈ అవినీతి కోటి దాటుతోంది.  

వలంటీర్లు రావడంతో వెలుగుచూసిన అక్రమాలు 
కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఈ అడ్డగోలు బియ్యం అవినీతిని గ్రామ, వార్డు వలంటీర్లు వెలుగులోకి తీసుకువచ్చారు. వలంటీర్లు వారి వద్ద ఉన్న యాప్‌ ఆధారంగా బీపీఎల్‌ లబ్ధిదారులకు బియ్యం వేయడంతో.. గతంలో డీలరు తక్కువగా బియ్యం ఇచ్చేవాడు, ఈసారి ఎక్కువ వచ్చాయని లబ్ధిదారులు చెబుతున్నారు. దీంతో అసలు రంగు బయటపడింది. దీంతో కొంతమంది టీడీపీ కార్యకర్తలు వాలంటీర్లపై దాడులకు కూడా పాల్పడిన సందర్భాలు జిల్లాలో ఉన్నాయి. వారి అవినీతి బయటపడుతోందన్న భయంతో వాలంటీర్లపై టీడీపీ నాయకులు పలుచోట్ల విరుచుకుపడుతున్నారు.  
 
ప్రత్యేక డ్రైవ్‌ అవసరం 
ఈ రేషన్‌ కార్డులు, వారి కార్డులో ఉన్న యూనిట్లపై ప్రత్యేక డ్రైవ్‌ అవసరం ఉంది. ఇప్పటి వరకు వలంటీర్లకు తెలిసిన వారి యూనిట్లు మాత్రమే గుర్తించి వాటిని తొలగిస్తున్నారు. ఇంకా చాలా యూనిట్లు ఉన్నట్టు లబ్ధిదారులకు తెలియదు. దీనిపై అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తే మరింత అవినీతి వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని మండలాల వారు మాత్రమే యూనిట్లను తొలగిస్తున్నారు. అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. వలంటీర్లు ఇంటింటి సర్వే, మ్యాపింగ్‌లో పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే, మరిన్ని అడ్డగోలు యూనిట్లు బయటపడనున్నాయి.   

మరిన్ని వార్తలు