పనులేమీ చేయలేదు.. నిధులు మాత్రం స్వాహా చేశారు..!

23 Oct, 2019 06:45 IST|Sakshi
గ్రామసభలో వివరాలు తెలియజేస్తున్న అధికారులు 

ఉపాధి పనులు చేయకుండా నిధుల స్వాహా

గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్వాకం

సామాజిక తనిఖీలో బయటపడిన వాస్తవాలు

రూ.1.25 కోట్ల మేర పనులు

పెద్ద మొత్తంలో అవినీతి జరిగినట్లుగా నిర్ధారణ

నివ్వెరపోయిన గ్రామస్తులు  

సాక్షి, వెంకటగిరిరూరల్‌: అక్కడ ఉపాధి హామీ కింద పనులేమి జరగలేదు. కానీ జరిగినట్లుగా రికార్డులు సృష్టించి నిధులు స్వాహా చేసేశారు. మొత్తం రూ.1.25 కోట్ల మేర పనులు జరగ్గా పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని తేలింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ నిర్వాకం సామాజికతనిఖీలో బయటపడింది. బాలాయపల్లి మండలంలోని నిడిగల్లు గ్రామంలో మంగళవారం సోషల్‌ ఆడిట్‌ బృంద సభ్యులు గ్రామసభల ద్వారా దీనికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. గత ప్రభుత్వం హయాంలో 2018 – 2019 ఆర్థిక సంవత్సరంలో నిడిగల్లు గ్రామంలో ఉపాధి హామీ పనులు మంజూరయ్యాయి. అయితే పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారు. నిడిగల్లు, గాజులపల్లి, చాకలపల్లి, గొల్లపల్లిల్లో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి వర్స్‌ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా చేయలేదు. 24 ఐడీలకు సంబంధించి వెయ్యి, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కింద 21,700 చొప్పున నేమ్‌ బోర్డులు ఏర్పాటు చేసినట్లుగా రికార్డుల్లో ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఎక్కడా బోర్డులు కనిపించలేదని అధికారులు తెలిపారు.

ఇతర రంగాల నుంచి అర్హుత లేని ముగ్గురు వ్యక్తుల చేత ఉపాధి పనులు చేయించి రూ.36 వేలు, రూ.34 వేలు నిధులు డ్రా చేసినట్లుగా రికార్డుల్లో ఉంది. పీటీలు, పశువుగుంట పనులు, పూడికతీత పనులు ఫీల్డ్‌ లెవలింగ్, పాఠశాలలు, శ్మశానంలో జరిగిన పనులు కూలీల చేత కాకుండా యంత్రాల ద్వారా చేసి నిధులు డ్రా చేశారు. అంతేగాకుండా నిడిగల్లుకు సంబంధించి ఐదు చెరువులున్నాయి. ఇక్కడ గుంతలు తవ్వేసి పనులు చేశామని చెప్పి నగదు డ్రా చేసినట్లుగా గుర్తించారు. కాగా దీనిపై అధికారులు స్థానికులను విచారించగా చెరువు వద్ద పనులు నిర్వహించి మూడేళ్లవుతోందని, ఇప్పటి వరకు పూడికతీత పనులు జరగలేదని తెలిపారు. 2017 సంవత్సరంలో నిడిగల్లు చెరువుకు గండి పడడంతో పూడ్చేందుకు సమీప వ్యవసాయ పొలం రైతు తన సొంత నిధులతో మట్టిని తోలగా ఆ పనికి కూడా మస్టర్‌లో బిల్లులు మంజూరుచేసి నిధులు స్వాహా చేశారు.

అదే గ్రామానికి చెందిన బలరామయ్య అనే వ్యక్తి తన సొంత నిధులతో శ్మశానవాటికి మట్టి తోలించి చదును చేయించాడు. అయితే దీనిని ఉపాధి పథకం కింద చూపించి రూ.3.80 లక్షల నిధులను డ్రా చేశారు. నా సొంత నిధులతో పనులు చేస్తే నిధులు ఎలా డ్రా చేస్తారని అధికారుల ముందు బలరామయ్య వాపోయాడు. ఇక పూడికతీతలు, సైడ్‌కాలువల నిర్మాణంలో ఎక్కడా పనులు చేయకుండా 11 గ్రూపుల డిమాండ్‌ ఫారంలో ఒక్కరే సంతకాలు చేసి నిధులు స్వాహా చేసినట్లు నిర్ధారించారు.  

సంతకాలు లేకుండానే.. 
గ్రామ పెద్ద చెరువు పైభాగంలో జరిగిన పనుల్లో 42 మస్టర్లు ఉపయోగించారని అయితే రికార్డుల్లో ఏపీఓ, ఎంపీడీఓ అధికారుల సంతకాలు లేవని అధికారులు గుర్తించారు. బోయినగుంట వద్ద పశువుగుంత, పూడికతీత పనులు 1,789 క్యూబిక్‌ల మేర చేయగా ఇవి యంత్రాలతో చేసినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి 15 గ్రూపుల వారు 20 మస్టర్లు ఉపయోగించి డిమాండ్‌ ఫారంలో ఒక్కరే సంతకాలు చేసి నిధులు డ్రా చేసినట్లుగా గుర్తించారు. గ్రామ పెద్ద చెరువు పైభాగంలో మోహన్‌ చేయిన్‌ గుంతల్లో పూడికతీత పనుల్లో 1,415 క్యూబిక్‌ మీటర్ల పనులు రికార్డు చేయగా 848 క్యూబిక్‌ మీటర్లు తక్కువ వచ్చింది.

రెడ్డి చెరువు నుంచి ఆర్‌అండ్‌బీ వరకు గొల్లపల్లి మరవ సమీపంలో ఉన్న మూడు కాలువలకు పనులు చేయకుండా నిధులు డ్రా చేసినట్లు తెలిపారు. తెలుగుగంగ కెనాల్‌ నుంచి గ్రామంలోని ట్యాంక్‌ వరకు పనులు చేశారని చెప్పారని, అయితే అక్కడ పనులేమి జరగలేదని అధికారులు తెలిపారు. సెర్ప్‌కు సంబంధించి రూ.99,450 ఖర్చు చేయడం జరిగింది. అయితే అభివృద్ధి జాడ మాత్రం లేదు. నిమ్మ చెట్లకు సంబంధించి ఇష్టానుసారంగా మొక్కలు నాటుకున్నట్లుగా చెప్పారు.
 
గ్రామస్తుల ఆగ్రహం  
గ్రామంలో పనులు నిర్వహించకుండా చేసినట్లుగా రికార్డుల్లో నమోదుచేసి నగదు డ్రా చేసుకోవడంపై నిడిగల్లు గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తనిఖీలు చేయకుండా బిల్లులు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు.

 
అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేçస్తున్న నిడిగల్లు గ్రామస్తులు    

మరిన్ని వార్తలు