‘టౌన్’లో మాయామశ్చీంద్ర

9 May, 2016 02:52 IST|Sakshi
‘టౌన్’లో మాయామశ్చీంద్ర

టీడీఆర్ బాండ్ల రీసైక్లింగ్
ఆన్‌లైన్లో వెలుగుచూసిన అక్రమాలు
బాధ్యులపై క్రిమినల్ కేసుకు  కమిషనర్ ఆదేశం
అధికారులకు చార్జి మెమో

టౌన్‌ప్లానింగ్ విభాగం అక్రమాలకు కేరాఫ్‌గా మారింది. నకిలీ  ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవపల్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్స్  హల్‌చల్ చేస్తున్నాయి.  తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా అధికారులు, దళారులు కుమ్మక్కై బాండ్ల కుంభకోణాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారన్న అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారులకు తెలియకుండానే బాండ్లు మారుబేరాలు సాగిపోవడం వివాదాస్పదమైంది. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు నాటి అధికారులకు చార్జి మెమోలు ఇవ్వాల్సిందిగా కమిషనర్ ఆదేశాలివ్వడంతో అక్రమార్కులు హడలెత్తుతున్నారు -విజయవాడ సెంట్రల్

వెలుగు చూసిందిలా..

టౌన్‌ప్లానింగ్ సేవల్ని ఆన్‌లైన్ చేశారు. ఈక్రమంలో గతంలో టీడీఆర్ బాండ్లు పొందిన యజమానులు వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తుండగా కొన్ని బాండ్లు గతంలో వినియోగించినట్లు తేలింది. తమకు తెలియకుండా బాండ్లు ఎలా వినియోగించారో తేలాలంటూ భవన నిర్మాణ యజమానులు కమిషనర్‌ను కోరారు. ఈమేరకు ఆయన ఫైళ్లను పరిశీలించగా స్కాం బయటపడింది. బందరు రోడ్డు విస్తరణలో భాగంగా 2012లో డి.సతీష్‌బాబుకు 89.16 చదరపు గజాలకు టీడీఆర్ బాండ్‌ను టౌన్‌ప్లానింగ్ విభాగం మంజూరు చేసింది. సతీష్‌బాబుకు తెలియకుండానే సత్యనారాయణపురానికి చెందిన జి.రంగారావు (బీఏ నెంబర్ 1830/2015) జీప్లస్ 4కు వినియోగించారు. లబ్బీపేటకు చెందిన ఎం.తిరుపతికి 36.35 చదరపు గజాలకు బాండు మంజూరు చేయగా అయ్యప్పనగర్‌కు చెందిన ఎం.భవానీ (బీఏ నెంబర్ 2521/2013) వినియోగించినట్లు తేలింది. దీంతో బాండ్లు పొందిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

 కేసులతో సరి

 గుణదల ఎల్‌ఐసీ కాలనీకి చెందిన టిపీసీహెచ్ కుమార్‌బాబు, శ్రీలక్ష్మి నాల్గోఅంతస్తు నిర్మాణా నిర్మాణానికి సంబంధించి ఉడా, నగరపాలక సంస్థ జారీ చేసిన రెండు టీడీఆర్‌బాండ్లను టౌన్‌ప్లానింగ్‌కు అందజేశారు. మండవ వెంకటేశ్వరరావు వద్ద వీరు ఆ బాండ్లను కొనుగోలు చేశారు. కార్పొరేషన్ ద్వారా 170.38 చదరపు అడుగుల బాండ్లు పొందిన ఎం. వెంకటేశ్వరరావు1299/2014,  2089/2014, 262/ 2014 బిల్డింగ్  అప్లికేషన్లకు 185.26 చదరపు అడుగు లు బాండ్లను  వాడేశారు. అంతటితో ఆగకుండా కుమార్‌బాబు, లక్ష్మికి 170.38 చదరపు అడుగులకు విక్రయించారు. ఈ స్కాంపై సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్ ఎం.వెంకటేశ్వరరావుపై కృష్ణలంక పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇంత వరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

 అంతా గుట్టు

 టీడీఆర్ బాండ్లు ఎవరికి మంజూరు చేశారు. వాటిని ఎక్కడెక్కడ వినియోగించారనే విషయాన్ని టౌన్‌ప్లానింగ్ అధికారులు గుట్టుగా ఉంచుతున్నారు.  బాండ్ల జారీ పేరుతో  టౌన్‌ప్లానింగ్, సర్వే విభాగాల్లోకి కొం దరు అధికారులు క్యాష్ చేసుకుంటున్నారనే  వాదనలు ఉన్నాయి. సర్వే విభాగంలోని ఓ అధికారి చక్రం తిప్పారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.  బాండ్లను విని యోగించిన వెంటనే టౌన్‌ప్లానింగ్ విభాగంలోని సూపరింటెండెంట్ స్థాయిఅధికారి క్యాన్సిల్డ్ అని బాండ్‌పై స్టాంప్ వేయాల్సి ఉంటుం ది. విచిత్రం ఏమిటంటే బాండ్లకు సంబంధించిన రికార్డు సైతం అధికారులు అందుబాటులో ఉంచడం లేదు.

 అధికారిపై మంత్రి గుర్రు

 టౌన్‌ప్లానింగ్‌లో కీలక అధికారి అవినీతికి అంతులేకుండా పోతుందన్న ఆరోపణలున్నాయి. కొన్ని ఆధారాలతో సహా ఇటీవలే  మునిసిపల్ మంత్రి పి.నారాయణకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. గతంలో పనిచేసిన ప్రాంతంలోనూ అయ్యగారి అక్రమాల చిట్టా కొండవీటి చాంతాడంత ఉందని తెలుసుకున్న మంత్రి  అధికారిని బదిలీ చేయాల్సిందిగా టౌన్‌అండ్ కంట్రీప్లానింగ్ డెరైక్టర్ రఘుకు సూచించినట్లు సమాచారం.  కృష్ణా పుష్కరాలు పూర్తయ్యే వరకు అధికారిని ఇక్కడే కొనసాగిద్దామని డీటీసీపీ  సర్ధిచెప్పినట్లు భోగట్టా.

 చెక్ చేసుకోండి

 టౌన్‌ప్లానింగ్ విభాగం ద్వారా టీడీఆర్ బాండ్లు పొంది ఇప్పటి వరకు వినియోగించుకోని వారు వెంటన్ ఆన్‌లైన్లో చెక్ చేసుకోవాల్సిందిగా కమిషనర్ జి.వీరపాండియన్ సూచించారు. ఆన్‌లైన్ విధానం అమల్లోకి వచ్చాక అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయన్నారు. బ్రోకర్ల ద్వారా టీడీఆర్ బాండ్లు కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు.

 

 

>
మరిన్ని వార్తలు