మస్తరు.. మాయాజాలం

6 Jul, 2020 09:31 IST|Sakshi

కోవిడ్‌–19 ప్రభావంతో మ్యాన్యువల్‌గా కాంట్రాక్ట్‌ కార్మికుల హాజరు నమోదు

తక్కువమందితో పనిచేయించి, ఎక్కువమందికి వేతనాలు ఇచ్చినట్టు చూపించిన వైనం 

ప్రజారోగ్య విభాగంలో కాంట్రాక్టర్ల నకిలీ బిల్లులు 

ఆడిట్‌లో దొరికిన రూ.50 లక్షల బిల్లులు 

విజయవాడ లిట్టర్‌ఫ్రీ జోన్‌కు సంబంధించిన వ్యవహారం 

పటమట(విజయవాడ తూర్పు): వీఐపీలు తిరుగాడే బందరురోడ్డు, ఏలూరు రోడ్డును వీఎంసీ లిట్టర్‌ఫ్రీజోన్‌గా ప్రకటించింది. ఈ రోడ్లలో వ్యర్థపదార్థాలు, చెత్త, దుమ్మును  నిత్యం శుభ్రం చేయటానికి కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు షిఫ్టులవారీగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో లిట్టర్‌ ఫ్రీ జోన్‌లో 150 మంది విధులు నిర్వహించేవారు. అయితే కార్మికుల సంఖ్యను 150 నుంచి 200 మందికి పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో కౌన్సిల్‌ తీర్మానం కూడా అయ్యింది. మార్చి నుంచి ఆగస్టు వరకు ఆరునెలలపాటు కాంట్రాక్టు నిర్వాహణను కృష్ణలంకకు చెందిన ఓ కాంట్రాక్టరు చేపట్టారు. రూ.1.75 కోట్ల కాంట్రాక్టును టెండర్‌ ప్రాతిపదికన కాకుండా అత్యవసర సేవలుగా నామినేడెట్‌ పద్ధతిలో కాంట్రాక్టు పొందారు.

గతంలో కంటే 50 మంది మగ వర్కర్లను నియమించుకుని రోడ్డు–ఎండ్‌–టూ ఎండ్‌ ఊడ్చేందుకు, ఫూట్‌పాత్‌లను శుభ్రం చేసేందుకు, యూనిఫాం, పారిశుద్ధ్య పరికరాలతోపాటు, చెత్తను వేయటానికి ప్రత్యేక కవరును ఏర్పాటు చేసుకునేలా సదరు సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. అయితే మార్చి నుంచి ఇప్పటి వరకు కేవలం ప్రతినిత్యం 150 మందితోనే పనిచేయించి 200 మంది దొంగ హాజరు చూపించి, ఏప్రిల్‌ – మే నెలలకు సంబంధించి బిల్లుపెట్టడంతో ఆడిట్‌ అభ్యంతరాలతో విషయం బయటకు పొక్కింది. దీనికి వీఎంసీ ప్రజారోగ్య కీలక అధికారి కూడా సహకరించారని, హాజరును బట్టి కాంట్రాక్టు బిల్లులు చెల్లించాలని కమిషనర్‌ ఆదేశించినప్పటికీ ఈ విభాగం అధికారులు బేఖాతరు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.  

కోవిడ్‌ ప్రభావంతో మ్యాన్యువల్‌గా హాజరు.. 
గతంలో బయోమెట్రిక్‌ విధానంతో మస్తరు నమోదు జరిగేది. మార్చి నుంచి నగరంలో కోవిడ్‌–19 ప్రభావం ఉండటంతో బయోమెట్రిక్‌ విధానం రద్దుచేసి ఫేస్‌ రికగ్నైజేషన్‌ లేదా సంతకాలతో మ్యాన్యువల్‌గా హాజరు నమోదు చేయటం వల్ల తక్కువ మంది హాజరైనా ఎక్కువమంది అయ్యినట్లు క్షేత్రస్థాయి సిబ్బంది కాంట్రాక్టరుకు సహకరించినట్లు విమర్శలకు విన వస్తున్నాయి. దీనిపై విచారణకు ఆదేశించినప్పటికీ శనివారం సదరు కాంట్రాక్టు సంస్థ నుంచి రూ. 50 లక్షల బిల్లును ప్రజారోగ్య విభాగం నుంచి అప్రూవల్‌ పొంది ఆడిట్‌కు రాగా అధికారులు హాజరుపట్టీని సమర్పించాలని, షిప్టులవారీ డ్యూటీ షీట్‌ను సమర్పించాలని ఆదేశించటం వివాదాస్పదమయ్యింది.

పరికరాలూ వీఎంసీవే.. 
ఒప్పందం ప్రకారం పారిశుద్ధ్య సిబ్బంది వినియోగించే పరికరాలు, యూనిఫాం, ఇతర యంత్రాలు కాంట్రాక్టర్లే సమకూర్చుకోవాల్సి ఉంది. అయితే కొంతమంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సీఎంఈవై, డ్వాక్రా సిబ్బందిచే వీఎంసీ తయారు చేయిస్తున్న పరికరాలు, యూనిఫాం, గ్లౌజులు, బ్యాక్‌ప్యాక్‌లను ఆయా కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన తరలిస్తున్నారని, ఇందుకుగాను ఒక్కో కాంట్రాక్టర్‌ నుంచి నెలవారీ మామూళ్లు పొందుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి.

లిట్టర్‌ ఫ్రీ జోన్‌లో మ్యాన్యువల్‌ హాజరే.. 
లిట్టర్‌ఫ్రీ జోన్‌లో మ్యాన్యువల్‌గానే మస్తరు వేస్తున్నాం. మస్తర్ల ప్రకారమే వేతనాలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కారి్మకులకు ఏప్రిల్‌–మే వేతనాలకు బిల్లులు వచ్చాయి. పరిశీలన జరిగాకే చెల్లింపులకు సిఫారసు చేశాం.
– వెంకటరమణ, సీఎంఓహెచ్, వీఎంసీ  

మరిన్ని వార్తలు