గురుస్సాక్షాత్‌ అపర కీచక!

15 Jul, 2019 10:14 IST|Sakshi
దాలిపాడు ఆశ్రమ పాఠశాలలో విచారణ చేస్తున్న పీవో నిషాంత్‌కుమార్‌ 

సాక్షి, రంపచోడవరం(తూర్పుగోదావరి) : మంచి చదువు లభిస్తుందనే కొండంత ఆశతో ఆదివాసీ బాలికలు ఆశ్రమ పాఠశాలల్లో చేరుతున్నారు. అయితే వారికి విద్య నేర్పాల్సిన గురువులే అత్యాచారాలకు పాల్పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలల్లో 50 సంవత్సరాల లోపు ఉపాధ్యాయులను నియమించరాదనే నిబంధన ఉంది. అయితే అది రంపచోడవరం ఐటీడీఏలో అమలుకు నోచుకోవడం లేదు. దాంతో 40 ఏళ్ల లోపు వయసుగలవారు ఉపాధ్యాయులుగా, వార్డెన్లుగా ఉంటున్నారు. వారిలో చాలామంది విద్యార్థినులను లొంగదీసుకోవడం, అబార్షన్లు చేయించడం పరిపాటిగా మారింది. తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ  నిందితులను సస్పెండ్‌ చేయడం వంటి స్వల్ప శిక్షలు వేసి తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నారు. దీంతో ఇలాంటి నేరాలు చేసేందుకు వారు వెనుకాడడం లేదు.    

రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 93 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 34 గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ  పాఠశాలలు. ఆశ్రమ కళాశాలల్లో బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ ఐటీడీఏ అధికారులు ఏ మాత్రం గుణపాఠం నేర్చుకోవడం లేదు.  తాజాగా వై రామవరం మండలం దాలిపాడు గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై  వార్డెన్‌ అత్యాచారాలు చేసి, పెళ్లి చేసుకున్నాడు. దీనిపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తీవ్రంగా స్పందించారు. వార్డెన్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకున్నారు. అతనిని సస్పెండ్‌ చేయడమే కాకుండా జైలుకు పంపించారు. గతంలో బోదులూరు, యార్లగడ్డ, టేకులవీధి, చింతూరు మండలంలోని  ఆశ్రమ పాఠశాలల్లో బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని పెండింగ్‌ విచారణ పేరుతో తిరిగి విధుల్లో తీసుకున్నారు. ఆ వ్యవహారాల్లో ‘డబ్బులు’ కీలకపాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. చాలా వరకు సంఘటనల్లో బాలికలపై లైంగిక వేధింపులు నాలుగు గోడలకే పరిమితమవుతున్నాయి. అడపాదడపా మాత్రమే బయటకు వస్తున్నాయి. 

విద్యార్థుల సంక్షేమం పట్టని ఐటీడీఏ 
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్ల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైది. లోతట్టు ప్రాంతంలో కొంత మంది వార్డెన్లు గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. పనిదినాల్లో నిరంతరం ఆశ్రమ పాఠశాలలో ఉండాల్సిన వార్డెన్లు రాత్రి పూట కొన్ని చోట్ల  ఉండడం లేదు. అక్కడే ఉండే ఏఎన్‌ఎంలు, నాల్గో తరగతి సిబ్బందికి అప్పగించి వెళ్లిపోతున్నారు.

ప్రక్షాళన  చేయాలి
ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో కొంత మంది అధికారుల తీరుతో  విద్యార్థులకు నష్టం జరుగుతోంది. ఆశ్రమ పాఠశాలలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దాలిపాడు ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న సంఘటనను తీవ్రంగా పరిగణించాలి. గిరిజన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించాలి. 
–నాగులపల్లి ధనలక్ష్మి, రంపచోడవరం ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు