నకిలీలలు...

20 Feb, 2014 01:39 IST|Sakshi

ఖమ్మం, న్యూస్‌లైన్ : వికలాంగులతో భర్తీ చేసే ఉద్యోగాలపై కూడా దళారులు కన్నేశారు. నకిలీ విద్యా సర్టిఫికెట్లు పుట్టించి అర్హతలేని వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు వీరు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. వివిధ రకాల కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లను విజయవాడ, విశాఖపట్టణం నగరాలలోని పలు శిక్షణకేంద్రాల నుంచి వీరు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి కొందరు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతుండడంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు.

 ప్రభుత్వ నిబంధనల ప్రకారం వికలాంగులకు కేటాయించిన పలు ఉద్యోగాలు గత కొద్ది సంవత్సరాలుగా భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో  గ్రూప్-4 కేటగిరీకి చెందినవి 24, అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగాలు 28 పోస్టుల భర్తీ కోసం గత నెల 17న జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 8 టైపిస్టు పోస్టులు, 3 జూనియర్ అసిస్టెంట్లు, ఒక బిల్ కలెక్టర్, ఒక కాంపౌండర్, 8 వాచ్‌మెన్‌లు, 9 మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్లు(పురుషులు), 8 అటెండర్లు, 5 కుక్, 5 కామాటీ, 2 పీహెచ్ వర్కర్‌లు, ఒక బాల్‌మెన్ పోస్టు ఖాళీలుగా చూపించారు. వీటి భర్తీకి జనవరి 20 నుంచి ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. గడువు ముగిసే నాటికి వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగాల కోసం 6,300 మంది వికలాంగులు దరఖాస్తు చేసుకున్నారు.  

 నకిలీ సర్టిఫికెట్ల జోరు..
 కాగా, దరఖాస్తు చేసిన వికలాంగులలో కావలసిన విద్యార్హత లేని వారు ఉన్నట్లు తెలుస్తోంది. దళారుల నుంచి కొనుగోలు చేసిన నకిలీ సర్టిఫికెట్లతో వీరు ఉద్యోగం పొందేందుకు సిద్ధమైనట్లు సమాచారం.  ప్రధానంగా ఎంపీహెచ్‌డబ్ల్యూ(పురుషులు) ఉద్యోగాల కోసం నకిలీ సర్టిఫికెట్లతో పలువురు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగాలకు  మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్(ఎంపీహెచ్‌డబ్ల్యూ) రెండేళ్ల కోర్సు పూర్తి చేసినవారు మాత్రమే అర్హులు.  అయితే కొందరు దళారులు వైజాగ్, విజయవాడలలోని పలు ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు, ఇతర కళాశాలల నుంచి  సర్టిఫికెట్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది.

 ఒక్కో సర్టిఫికెట్‌కు రూ. 50 వేల నుంచి లక్ష వరకు చెల్లించి తెచ్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా జిల్లాకు 50 సర్టిఫికెట్ల వరకు వచ్చాయని తెలుస్తోంది. అయితే అధికారుల పరిశీలనలో తమ బండారం బయటపడుతుందని భావించిన కొందరు అక్రమార్కులు.. వారికి కూడా ముడుపులు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారని, దీంతో ఆ శాఖలోని పలువురు అధికారులు నకిలీలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుండడంతో అర్హత కలిగిన నిరుద్యోగులు.. న్యాయంగా తమకు రావాల్సిన ఉద్యోగం చేజారి పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, నకిలీల బండారం బయటపెట్టి అర్హత ఉన్నవారికే ఉద్యోగాలు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు