ఆధునికీకరణ నత్తనడకే..

10 Feb, 2014 03:27 IST|Sakshi

లింగసముద్రం, న్యూస్‌లైన్:  రాళ్లపాడు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. ఈ పనుల కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ (జికా) కింద రూ. 23 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో రూ. 6.5 కోట్ల మెకానికల్ పనులను హైదరాబాద్‌కు చెందిన స్వప్న కనస్ట్రక్షన్, రూ. 16.5 కోట్ల సివిల్ పనులను విజయవాడకు చెందిన స్వర్ణ కనస్ట్రక్షన్స్ వారు టెండర్లలో దక్కించుకున్నారు.

2014 ఫిబ్రవరి 23 నాటికి పనులు పూర్తిచేసేలా అగ్రిమెంట్ అయ్యారు. అయితే మెకానికల్ పనులు రూ. 5.8 కోట్లకుగాను 95 శాతం పనులు పూర్తిచేశారు. విద్యుత్ పనులతో పాటు, చిన్నపాటి మరమ్మతులు నిలిచిపోయాయి. సివిల్ పనుల్లో రూ. 14.79 కోట్లకుగాను 40 శాతం మాత్రమే పూర్తయ్యాయి. సివిల్ పనులు ఏడాది నుంచి నత్తనడకన జరుగుతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. సివిల్ పనుల్లో ప్రాజెక్టులోని కుడి కాలువ 12.1 నుంచి 16.3 కిలోమీటరు వరకు, జంగాలపల్లెలో 1.3 కిలోమీటరు వరకు లైనింగ్‌కు రూ. 6.7 కోట్లతో చేయాల్సిన పనులు నిలిచిపోయాయి.

 కుడికాలువ లైనింగ్ బదులు గైడ్‌వాల్ నిర్మించాలని ప్రాజెక్టు అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు, జికా ప్రతినిధులకు ఆరు నెలల క్రితం నివేదిక అందజే శారు. నివేదిక పరిశీలించి ఉన్నతాధికారులు గైడ్‌వాల్‌కు అవసరమైన నిధులు మంజూరు చేయకపోవడంతో కుడికాలువ లైనింగ్ పనులు నిలిచిపోయాయి. సివిల్ పనుల్లో కుడికాలువ లైనింగ్, గైడ్‌బ్యాక్, ప్రాజెక్టు రోడ్డు, క్వార్టర్స్ పనులు చేయాల్సి ఉంది. ముందుగా పాత క్వార్టర్లకు చెందిన పెంకుల గది పడేశారు. కానీ క్వార్టర్ల పనులు ప్రారంభించలేదు.

అగ్రిమెంట్ ప్రకారం సివిల్ పనులు ఫిబ్రవరి చివరి నాటికి పూర్తిచేయాలి. నెల రోజుల క్రితం ప్రాజెక్టును సందర్శించిన జికా ప్రతినిధులు సివిల్ పనులు నత్తనడకన జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  జూన్ చివరి నాటికి పూర్తిచేయాలని గడువు పొడిగించారు. అయినా పనుల వేగం పుంజుకోలేదు. దీనిపై ప్రాజెక్టు డీఈ శ్రీనివాసమూర్తిని వివరణ కోరగా జనవరి నుంచి పనులు ప్రారంభించాల్సి ఉండగా మూడు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని కాంట్రాక్టర్ తెలిపారని చెప్పారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు నోటీసులిచ్చామన్నారు. కాంట్రాక్టు గడువును జూన్ వరకు పొడిగించారన్నారు. జంగాలపల్లె కాలువ, ప్రాజెక్టుపై రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు